నామ్‌కే వాస్తే లాలూ!

Lalu Prasad Yadav will contest against real Lalu's samdhi - Sakshi

ఈ ఎన్నికల్లో ‘నామ్‌కే వాస్తే’ అభ్యర్థుల బెడద అసలు అభ్యర్థులకు తప్పడం లేదు. ఊరూ పేరూ లేకున్నా పాపులర్‌ రాజకీయ వేత్తల పేర్లున్న సాధారణ పౌరులను అసలు సిసలు అభ్యర్థులపై పోటీకి నిలబెట్టి ఓట్లు చీల్చే ప్రక్రియతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు.   మే 6న పోలింగ్‌ జరిగే సారణ్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేరు కూడా ఉండడంతో అక్కడి ఓటర్లు తికమకపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే నిజానికి అభ్యర్థుల జాబితాలో ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం దాణా స్కాంలో జైల్లో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు అయిన అసలు సిసలు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే ఈ లాలూ కేవలం ఓ సాదాసీదా నామ్‌కే వాస్తే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాత్రమే. అయితే 2014లో రబ్రీదేవి మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈ మామూలు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి 9,956 ఓట్లు వచ్చాయి. ఇతని మాదిరిగానే ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాదిరి పేరున్న మరో వ్యక్తి కూడా 2014లో రబ్రీ దేవిపై పోటీ చేశారు.

అతనికి కూడా 14,688 ఓట్లు రావడం విశేషం. అయితే ఇలా ఒకే పేరున్న అభ్యర్థులు ఓట్లు చీల్చడం వల్లనే రబ్రీదేవి ఆ ఎన్నికల్లో 40,948 ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని ఆర్జేడీ ఆరోపిస్తోంది.  ఈ నామ్‌కే వాస్తే లాలూ యాదవ్‌ తనకు ఏ స్థిర చరాస్తులూ లేవని నామినేషన్‌ పత్రాల్లో నమోదు చేశారు. అలాగే ఇతనికి పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా ఉన్నప్పటికీ వారి వివరాలేవీ ఇందులో పొందుపరచలేదు. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద 25,000 రూపాయలను చెల్లించి నామినేషన్‌ పత్రాలను పొందిన లాలూ కాని లాలూ ప్రసాద్‌ భవిష్యత్తులో తమ ఓటర్లను తికమకపెట్టే పరిస్థితి ఉందని ఆర్జేడీ ఆందోళన పడుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top