
జడ్చర్ల టౌన్: ‘ఇంట్లో కూర్చుని పనిచేసే సీఎం మనకొద్దు.. అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం’అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరఫున రోడ్డు షో ద్వారా ప్రచారం చేశారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ హయాంలో మహిళలకు అన్ని రంగాల్లోనూ అవమానమే జరిగిందని, మహిళామంత్రి లేని కేబినెట్‌గా చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
మహిళాసంఘాలకు రుణాలివ్వకుండా ఇబ్బందుల పాలు చేశారని విమర్శించారు. బతుకమ్మ చీరల పేరుతో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండాపోయిందని, లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాల్లో దేశం లోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో మహిళా సిబ్బంది కొరత ఉందని, ఆ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నా రని పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న కవిత రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నారని కుష్బూ విమర్శించారు. బీసీలకు తాము టీఆర్‌ఎస్ కన్నా సముచితస్థానం కల్పించామన్నారు. సమావేశంలో మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.