ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం

KTR Meets Huzurnagar By Election Incharge And Party Leaders - Sakshi

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక ఇన్‌చార్జీలు, పార్టీ నేతలతో కేటీఆర్‌ భేటీ

మున్సిపల్‌ ఎన్నికల్లో విపక్షాలను తక్కువగా అంచనా వేయొద్దని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ‘మున్సిపల్‌ ఎన్నికలు ఈ నెలలో లేదా.. కోర్టు తీర్పు కొంత ఆలస్యమైతే వచ్చే నెలలో జరిగే అవకాశముంది. మున్సిపల్‌ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇతర ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వైవిధ్యంగా, భిన్నంగా ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవతలి పార్టీ అభ్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఒక్క ఓటుతోనూ ఓడిన సందర్భాలున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి..’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ఇన్‌చార్జీలుగా పనిచేసిన పార్టీ రాష్ట్ర నేతలు, నల్లగొండ జిల్లా, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్‌ సోమవారం తెలంగాణభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించే దుర్మార్గులు పక్క పార్టీల్లో ఉన్నారు. విపక్ష పార్టీల నేతల తరహాలో బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల దుష్ప్రచారానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఎగిరిపడే వారికి ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలి’అని అన్నారు.

బీజేపీది ఓవరాక్షన్‌.. 
‘హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో బీజేపీ ఓవరాక్షన్‌ చేసి.. నిన్న మొన్నటిదాకా బిల్డప్‌ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికల తర్వా తే హుజూర్‌నగర్‌లో ఎన్నికలు జరగాలని కోరుకుంది. హుజూర్‌నగర్‌ ఎన్నిక జరగకుండా బీజేపీ అడ్డుకునే ప్రయ త్నం చేసిందనే సమాచారం ఉంది. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికతో బీజేపీ ప్రచార పటాటోపం బయటపడింది.’అని కేటీఆర్‌ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు గాలివాటమే అని తేలిపోవడంతో పాటు, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలమేమిటో ప్రజలు ఓట్లు వేసి మరీ తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థి సాధించిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. హుజూర్‌నగర్‌ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలమేంటో తేలిపోయింది. స్వయానా టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. ప్రజాభిమానం ముందు ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటం చిన్నబోయింది’అని వ్యాఖ్యానించారు.

కారు గుర్తును పోలిన చిహ్నాలతో నష్టం 
‘హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డికి 50వేలకు పైచిలుకు మెజారిటీ వచ్చేది. పార్టీ చిహ్నం కారు గుర్తును పోలిన ఇతర చిహ్నాలతో నష్టం జరిగింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాం టి తప్పులు జరగకుండా పరిష్కారం చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెప్తున్నాం. హుజూర్‌నగర్‌ ప్రజల రుణం తీర్చుకునేందుకు, ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే సైదిరెడ్డిపై స్థానిక నేతలు ఒత్తిడి తేవాలి. అధికారం, దుర్వినియోగం కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, ప్రతిపక్ష నేతలు టీఆర్‌ఎస్‌లోకి వస్తే తీసుకుని పార్టీని బలోపేతం చేయాలి’ అని కేటీఆర్‌ సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్‌.. సంస్థాగత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు కృషి చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్‌ అభినందించారు.

కంచుకోట కాదు..
కరుగుతున్న మంచుకొండ 
హుజూర్‌నగర్‌ను కాంగ్రెస్‌ కంచుకోట అంటూ మీడియా ప్రచారం చేసిందని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ కంచుకోట.. అక్కడ కరుగుతున్న మంచుకొండ అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల విజయం సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి, కేటీఆర్‌ వ్యూహానికి దక్కిన ఫలితంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అభివర్ణించారు. ‘కాంగ్రెస్‌ గెలిస్తే ఉత్తమ్‌ కుటుంబానికి లాభం, టీఆర్‌ఎస్‌ గెలిస్తే హుజూ ర్‌నగర్‌ ప్రజలకు లాభం అని కేటీఆర్‌ ఇచ్చిన నినాదానికి అక్కడి ప్రజలు ఓట్లేశారన్నారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ ఇచ్చిన విందు లో నల్లగొండ జిల్లా, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో పాటు, పార్టీ ఉప ఎన్నిక ఇన్‌చార్జీలు.. మొత్తం 300 మంది పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top