ఢిల్లీ పార్టీలు.. సిల్లీ పనులు

KTR Fires On Congress And BJP Over Alliance In Municipal Elections - Sakshi

టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తు

క్యూఆర్‌ విధానంలో మున్సిపాలిటీల్లో కొత్తగా ఇంటి నంబర్లు

ఢిల్లీ తరహాలో ప్రజల భాగస్వామ్యంతో పట్టణాల అభివృద్ధి: మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేవి సిల్లీ పనులు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేక జాతీయ పార్టీ లైన కాంగ్రెస్, బీజేపీ విలువలకు తిలోదకాలిచ్చి మున్సిపల్‌ ఎన్నికల్లో అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నాయి. మక్తల్‌లో కాంగ్రెస్‌ మద్దతుతో బీజేపీ, మణికొండ, తుర్కయాంజాల్‌లో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు దక్కించుకున్నాయి. టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు 2 జాతీయ పార్టీల నడుమ కుదిరిన ఫెవీక్విక్‌ అపవిత్ర బంధంతో ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ, శాఖల మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర అవతరణకు ముందు టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో రూపొందించిన నిబంధనల మేరకు తాము ఎక్స్‌అఫీషియో సభ్యుల సహకారంతో కొన్నిచోట్ల మున్సిపల్‌ పీఠాలు దక్కించుకున్నామని చెప్పారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎంఐఎం సహకారంతో తమ పార్టీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుందని చెప్పారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు ఏఐఎఫ్‌బీ పార్టీ గుర్తుపై మెజారీటీ స్థానాల్లో గెలిచినా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవి దక్కించుకోవడంపై కేటీఆర్‌ స్పందించారు. పార్టీ మార్గాన్ని విభేదించి వెళ్లిన వారితో సంబంధం లేకుండా క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి చైర్మన్‌ పదవి అప్పగించామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు బలంగా విశ్వసించడం వల్లే కరీంనగర్‌ సహా పది మున్సిపల్‌ కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులు మేయర్, చైర్మన్‌ పదవులు దక్కించుకున్నారన్నారు. చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడ్డ మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ పీఠాలను దక్కించుకుంటుందన్నారు. 

బాగేదారి విధానంతో అభివృద్ధి.. 
‘రాష్ట్రంలో పట్టణ జనాభా ప్రస్తుతం 43 శాతం కాగా, వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులు, డివిజన్ల ఏర్పాటును అత్యంత శాస్త్రీయంగా చేశాం. ఆదర్శవంతమైన పట్టణాలు రూపొం దించే లక్ష్యంతో కొత్త మున్సిపల్‌ చట్టాన్ని రూపొందించాం’అని కేటీఆర్‌ వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిని ప్రారంభించడంతో పాటు కొత్తగా ఎన్నికైన వారికి అర్బన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా నిధులు, విధులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా రూ.1,037 కోట్లకు రాష్ట్రం కూడా మరో రూ.1,037 కోట్లు జత చేసి రూ.2,074 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సగటున ప్రతినెలా తొలి వారంలోనే రూ.173 కోట్లు మున్సిపాలిటీలకు విడుదల చేస్తామన్నారు. క్యూఆర్‌ కోడ్‌ విధానంలో మున్సిపాలిటీల్లోని ఇళ్లకు కొత్త నంబర్లు ఇస్తామని వెల్లడించారు. యువత, మహిళలు, సీనియర్‌ సిటిజెన్స్, కాలనీ సంక్షేమ సంఘాలతో 4 కమిటీలు ఏర్పాటు చేసి ఢిల్లీ తరహాలో బాగేదారి విధానంలో పట్టణాలు అభివృద్ది చేస్తామని తెలిపారు. కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు, అనుమతు ల్లేని లే ఔట్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top