‘హస్తం’ చెంతకు కొండా..

Konda Couple Join On Congress Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఎట్టకేలకు కొండా దంపతులు సొంత గూటికి వెళ్లిపోయారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో బుధవారం ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు ‘హస్తం’లో చేరారు. ఈ సందర్భంగా రాహల్‌ వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో 20 రోజులుగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి జాబితాలో 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించి కొండా సురేఖకు పెండింగ్‌లో పెట్టడంతో వివాదం మొదలైంది. మూడు రోజుల అంతర్మథనం అనంతరం కొండా దంపతులు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు.

తన టికెట్‌ను పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏమిటని కొండా సురేఖ నిలదీశారు. తనకు టికెట్‌ రాకపోవ ఛ్ఛినికి కేటీఆరే కారణం అని ఆరోపించారు. తన ప్రశ్నలకు రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే, బహిరంగ లేఖ రాసి పార్టీ నుంచి వైదొలుగుతామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ లో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్‌ చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి.. బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు.

కొద్దిగా కష్టపడితే సోనియాగాంధి అపాయింట్‌మెంట్‌ నాలుగు రోజుల్లో దొరుకుతుంది గాని, కేసీఆర్‌ అపాయింట్‌మెంటు నాలుగేళ్లు నిరీక్షించినా దొరకలేదని విమర్శించారు. వారు ఈ విమర్శలు చేసిన మరుసటి రోజే కాంగ్రెస్‌ పార్టీలో చేరడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తాము బేషరతుగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు చెప్పారు. వరంగల్‌ జిల్లాలో కనీసం ఐదారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రాహుల్‌ గాంధీని మళ్లీ కలుస్తామని శపథం చేశారు.  

కొండా సురేఖకు కండువా కప్పుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, చిత్రంలో కొండా మురళీధర్‌రావు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top