మేం వస్తే యాదాద్రి ప్లాంట్‌ను ఆపేస్తాం

Komati reddy Venkata reddy about Yadadri Power Plant - Sakshi

మాజీమంత్రి కోమటిరెడ్డి  

సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దామరచర్లలోని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను ఆపితీరుతాం. ఆ ప్రాజెక్టు వల్ల జిల్లా కాలుష్యం బారిన పడుతుంది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కారణంగా ఆ ప్రాంతం ప్రజలు బొగ్గు.. పొగతో చస్తారు. ఇది అంత గొప్ప ప్రాజెక్టు అయితే.. సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఎందుకు నెలకొల్పలేదు. జిల్లా మంత్రికి, ఆయన చెంచాలకు కాంట్రాక్టులు ఇచ్చి ప్రజలకు నష్టం జరిగే విధంగా ఇక్కడ పెట్టారు. మిర్యాలగూడ ఎమ్మెల్యేకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి , పార్టీలోకి తీసుకున్నారు. భూముల కోసం ఆయన రైతులను ఇబ్బందులు పెడుతున్నాడు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును ఆపితీరుతాం’అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ, దామరచర్లలోని పవర్‌ ప్రాజెక్టును ఇప్పుడు రూ.30 వేల కోట్లతో ప్రారంభించినా, అది పూర్తయ్యే సరికి కనీసం రూ.80 వేల కోట్లు అవుతుందని, కేవలం దోచుకునేందుకు మాత్రమే దీనిని ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ సొంత డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మాటిమాటికీ చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చానని చెప్పుకుంటున్నారని, అసలు ఆయన చేసిందంతా దొంగ దీక్షని ఆరోపించారు.

గ్లూకోజ్‌ పెట్టుకొని దీక్ష చేస్తే ఎవరైనా చనిపోతారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ఏళ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి మచ్చలేని నాయకుడని, అలాంటి వ్యక్తిని దొంగ అంటున్న కేసీఆరే గజదొంగని విమర్శించారు. మహిళలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్న కేసీఆర్‌ తన మంత్రివర్గంలో వారికి ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు ఇవ్వడం ఓ పెద్ద కుంభకోణం అని, కిలోల లెక్కన ఇతర రాష్ట్రాలనుంచి కొనుకొచ్చి ఇక్కడ తయారు చేయిస్తున్నట్టు చెబుతున్నారని దుయ్యబట్టారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top