కనీసం పది సీట్లలోనైనా పోటీ చేస్తాం

Kodandaram Launches TJS Party Symbol - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) పార్టీ గుర్తు అగ్గిపెట్టెను ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీసం పది సీట్లలోనైనా పోటీ చేయాలని టీజేఎస్‌ భావిస్తుందన్నారు. నేడు మహాకూటమి పొత్తులపై చర్చించడానికి కాంగ్రెస్‌ నేతలను కలుస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వరకు కూటమికి తుది రూపం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళి వరకు మహాకూటమి నెలకొంటుందని అన్నారు. మహాకూటమి ఏర్పాటు ప్రజలకు భరోసా నింపిందని పేర్కొన్నారు. పొత్తుల్లో జాప్యం వల్ల ప్రజా సంఘాల్లో నిరుత్సాహం ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. కూటమి ఏర్పాటులో జాప్యం వల్ల ప్రచారం దెబ్బతిందని అభిప్రాయపడ్డారు. అయిన ఇప్పటికి మించిపోయింది లేదన్నారు. 

పొత్తుల అంశంపై తొందరగా ముందుకు వెళ్తే.. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పెను మార్పు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ అకాంక్షలను నిలబెట్టాలనుకునే వారు, ప్రతి ప్రజా సంఘం మహాకూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. కూటమి కూర్పులో జాప్యం వల్ల తప్పుడు వార్తలు ప్రజల్లోకి వెళ్తున్నాయనే అసంతృప్తి నాయకుల్లో ఉందన్నారు. సీట్ల సర్దుబాటు త్వరగా జరగకపోతే ప్రజల్లో నమ్మకం కోల్పోతామని తెలిపారు. తమకు గెలిచే సామర్ధ్యం గల అభ్యర్థులు ఉన్నట్టు స్పష్టం చేశారు. దసరాకి స్పష్టత రావాల్సిన పొత్తుల వ్యవహరం దీపావళి వరకు కూడా కొలిక్కి రాకపోవడం మంచి పరిణామం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సీపీఐని కూటమిలో కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కూటమిపై ఉందన్నారు. సాయంత్రం వరకు సీసీఐ సీట్ల సర్దుబాటు సమస్య ముగుస్తుందని తెలిపారు. సీపీఐ కూటమిలో తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top