ఎన్పీఆర్‌లో వివరాలు స్వచ్ఛందమే

Kishan Reddy Says That Details on NPR are voluntary - Sakshi

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)కు సంబంధించి ప్రజలు అందించాల్సిన సమాచారం తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. జనాభా రిజిస్టర్‌ సమయంలో ప్రజల వ్యక్తిగత సమాచారం వెల్లడించాల్సి ఉండటంపై కొన్ని బీజేపీయేతర పాలనా రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఎన్‌పీఆర్‌కి ఇవ్వాల్సిన సమాచారం ఎవరైనా స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చునని, అది నిర్బంధం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే 2010లో ఎన్‌పీఆర్‌ ప్రారంభించిందని, రాజ్యాంగపరంగా విధిగా ఈ ప్రక్రియ నిర్వహించాలన్నారు.

ఈ ప్రక్రియను నిర్వహించబోమని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడానికి వీల్లేదన్నారు. 2021 ఏప్రిల్‌లో జాతీయ జనాభా గణనకు ముందు జరిగే ప్రక్రియ మాత్రమేనని చెప్పారు. ఎన్‌పీఆర్‌ ఫామ్‌లో పుట్టిన వివరాలు, తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ వంటివి ఉండటంతో ఎన్సార్సీకి ముందు జరిగే తతంగమేనంటూ ఈశాన్య రాష్ట్రాలు, బీజేపీయేత పాలనా రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కేరళ వంటి రాష్ట్రాలు జనాభా గణనకు సహకరిస్తామే తప్ప ఎన్‌పీఆర్‌కు అంగీకరించబోమని తేల్చి చెప్పేశాయి. ఇక పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రం ప్రజలతో ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ధ్వజమెత్తారు. ఎన్‌పీఆర్‌ చుట్టూ వివాదం నెలకొనడంతో కేంద్రం ‘‘ఎన్‌పీఆర్‌లో సమాచారం వెల్లడి స్వచ్ఛందం మాత్రమే’’అని ప్రకటన చేయాల్సి వచ్చింది. 

అప్పట్లో మాట్లాడలేదేం ?  
రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియపై విపక్షాలు రచ్చ చేయడాన్ని కిషన్‌రెడ్డి తప్పు పట్టారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇంటింటికీ తిరిగి వారి వివరాలు, బ్యాంకు అకౌంట్లు, మెడికల్‌ హిస్టరీ వంటి ఎన్నో ప్రశ్నలు అడిగినా ఎవరూ ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. అప్పట్లో అసదుద్దీన్‌ ఒవైసీ వంటి నేతలు కూడా ఎలాంటి ప్రశ్నలు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఎన్‌పీఆర్‌పై వివాదం రాజకీయ దురుద్దేశపూరితమని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. 

ఎన్‌పీఆర్‌ అంటే..
దేశంలో నివసించే ప్రజల వివరాలను తెలుసుకొని, వారికి జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వడమే జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) ఉద్దేశం. పౌరసత్వ చట్టం 1955, జాతీయ గుర్తింపు కార్డుల జారీ నిబంధనలు, 2003 ప్రకారం ఈ పట్టికలో డేటాను గ్రామాలు, ఉప జిల్లాలు, జిల్లాలు, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. ఆరు నెలల నుంచి ఒక ప్రాంతంలో స్థిరనివాసం ఉన్నవారు, మరో ఆరు నెలలు ఆదే ప్రాంతంలో ఉండాలని అనుకుంటున్న వారి నుంచి వివరాలు సేకరిస్తారు. 2011 జనాభా గణనకు ముందు ఏడాది 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్‌పీఆర్‌ డేటాని సేకరించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో ఇంటింటికీ తిరిగి ఈ పట్టికను సవరించారు. ఆ సమయంలో ప్రజల నుంచి ఆధార్‌ నంబర్, మొబైల్‌ నంబర్లు అడిగి తెలుసుకున్నారు. ఈసారి డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు ఐడీ కార్డు వివరాలు అడిగే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియలో పాన్‌ వివరాలతో పని ఉండదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top