‘ఆయన రోజుకు 50 సార్లు చస్తారు’

Kejriwal Has Murdered AAP - Sakshi

సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

చండీగఢ్‌‌: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అకాలీదళ్‌ నేతకు క్షమాపణలు చెప్పడంతో పార్టీకి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే పంజాబ్‌ పార్టీ చీఫ్‌, ఎంపీ భగవంత్‌ మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కేజ్రీపై విమర్శలు గుప్పించారు.

‘పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్‌ ఈరోజు హత్య చేశారు. ఎవరైతే అకాలీదళ్‌ నేత బిక్రం సింగ్‌ మజితియాపై ఇన్నాళ్లూ ఆరోపణలు చేశారో వారే నేడు క్షమాపణలు చెప్పారు. దాని ఫలితంగా పంజాబ్‌లో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవడమే కాకుండా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజలను మోసంతో చేయడంతో పాటు, అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌ విశ్వాసం కోల్పోయారు. పార్టీ అధినేతగా ఉన్నవారే పూర్తిగా లొంగిపోయినపుడు ఇకపై డ్రగ్‌ మాఫియాకు వ్యతిరేకంగా ఆప్‌ నేతలు ఎలా మాట్లాడగలరు? ధైర్యవంతులు ఒకేసారి మరణిస్తారు. కానీ కేజ్రీవాల్‌ వంటి పిరికివాళ్లు రోజుకు యాభైసార్లు చస్తారంటూ’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్షమాపణ వల్ల ఆప్‌ మానసికంగా హత్యకు గురైందని సిద్ధూ సానుభూతి వ్యక్తం చేశారు. మొదట ఢిల్లీ నుంచే పంజాబ్‌లో చక్రం తిప్పాలని అనుకున్న కేజ్రీవాల్‌ ఇప్పుడు నిస్సహాయ జూదగాడిగా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు.

డ్రగ్స్‌ మాఫియాలో అకాళీ దళ్‌ నేత బిక్రం సింగ్‌ మజితియా హస్తం ఉందంటూ ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌ తాజాగా ఆయనకు క్షమాపణలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top