ప్రజలు మన వెంటే...

KCR On 2019 Lok Sabha Results - Sakshi

ఎన్నికల్లో గెలుపోటములు సహజం: కేసీఆర్‌ 

ముఖ్యమంత్రిని కలసిన లోక్‌సభ అభ్యర్థులు 

ఫలితాలపై సమీక్ష అవసరమన్న కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు టీఆర్‌ఎస్‌కు దక్కాయని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ముం దుకు సాగాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ కీలకనేత తన్నీరు హరీశ్‌రావు, మంత్రులు మహమూద్‌ అలీ, జి.జగదీశ్‌రెడ్డి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, సత్యవతిరాథోడ్, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులు పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పోతుగంటి రాములు, మాలోతు కవిత, వెంకటేశ్‌ నేత, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, బి.బి.పాటిల్, బూర నర్సయ్యగౌడ్, నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే సోలి పేట రామలింగారెడ్డి, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు తదితరులు శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌ ఇరవై నిమిషాలపాటు అందరితో ముచ్చటించారు.

ఎన్ని కల ఫలితాలపై ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఓడిన అభ్యర్థులను అనునయించారు. కేసీఆర్‌తో భేటీకి ముందు పలువురు అభ్యర్థులు, నేతలు కేటీఆర్‌ను కలిశారు. అక్కడి నుంచి అందరూ కేసీఆర్‌ దగ్గరికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు కొన్ని సెగ్మెంట్లలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయలేకపోయారని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో సమీక్ష అవసరమని కేటీఆర్‌ అక్కడ ఉన్న నేతలతో అన్నారు. ఫలితాలపై మందకొడిగా ఉండొద్దని, రాజకీయంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన కవిత ఉదయమే ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిశారు. టీఆర్‌ఎస్‌ కీలకనేత హరీశ్‌రావు... లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన కవిత, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్‌ ఇళ్లకు వెళ్లి వారిని అనునయించారు.

నేడోరేపో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన 
ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ప్రస్తుతం ఉప ఎన్ని క జరుగుతోంది. ఈ నెల 28తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. తక్కళ్లపల్లి రవీందర్‌రావును అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉందని అధికార పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. నెలాఖరులో పోలింగ్‌ జరగనున్న 3 స్థానిక సంస్థల స్థానాల్లో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం వారికి టీఆర్‌ఎస్‌ అవకాశం ఇచ్చింది. మైనంపల్లి రాజీనామాతో ఖాళీ అయి న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అదే సామాజికవర్గానికి చెందిన రవీందర్‌ను బరిలో దింపాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌లో క్రీయాశీలంగా ఉన్న నేతగా రవీందర్‌రావుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎప్పుడూ రాలే దు. 2014 ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన వారిలో రవీందర్‌రావు తప్ప మిగిలిన అందరికీ గత ప్రభుత్వం లో ఏదో ఒక పదవి దక్కింది. కాగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈసారి ఎమ్మెల్సీగా సీనియర్‌కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. మల్కాజ్‌గిరి నేత కె.నవీన్‌రావు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top