నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలున్నారు...

Judge Whatsapp Joke During Hearings on Karnataka Politics - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన ప్రతీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేపు సాయంత్రం ఏం జరగబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో కన్నడ రాజకీయాలకు జోకులు కూడా పేలుతున్నాయి. వాట్సాప్‌ మెసేజ్‌లు, మెమెలతో కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అలా చక్కర్లు కొడుతున్న ఓ జోకును ప్రస్తావించటం విశేషం.

ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం పిటిషన్లపై సీరియస్‌గా వాదనలు కొనసాగుతున్న సమయంలో జడ్జి సిక్రీ జోక్యం చేసుకుంటూ... ఇందాకే వాట్సాప్‌లో మాకు ఓ మెసేజ్‌ వచ్చింది‘‘ అయ్యా... నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దయచేసి నన్ను సీఎంను చెయ్యండి’’ అంటూ గవర్నర్‌ కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌ చేసి కోరతాడు. ఇంతకీ మీరు ఎవరయ్యా అని సిబ్బంది అడిగితే... ఎమ్మెల్యేలు తలదాచుకున్న హోటల్‌ యాజమానిని అని అవతలి వ్యక్తి సమాధానమిస్తాడు... అంటూ ఆ జోకును న్యాయమూర్తి సిక్రీ చదివి వినిపించారు. దీంతో కోర్టు హాల్‌ మొత్తం నవ్వులతో నిండిపోయింది. 

బెంగళూరులోని ఇగల్‌టన్‌ రిసార్ట్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తలదాచుకోవటంపై ఈ జోకు నిన్నంతా వైరల్‌ అయ్యింది. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని హోటల్‌లలో బస చేసిన విషయం తెలిసిందే. కాగా, గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా విధించిన 15 రోజుల గడువును తోసిపుచ్చిన కోర్టు శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణకు సిద్ధం కావాలని కర్ణాటక సీఎం యెడ్యూరప్పను ఆదేశించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top