జార్ఖండ్‌ ఎన్నికల తుది విడత పోలింగ్‌

Jharkhand Final Phase Of Polls 2019 Updates - Sakshi

రాంచి: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 16 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బోరియో, బార్హెట్‌, లితిపరా, మహేష్‌పూర్‌, సికారిపరా తదితర నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ ముగియనుంది. మిగతా స్థానాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కాగా ఉదయం 11 గంటల వరకు 28.24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇక జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, జేఎంఎం, ఆర్జేడీ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా డుమ్కా, బార్హెట్‌ నియోజకవర్గాల్లో బరిలో దిగిన ఆయన.. నేడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖుల భవిష్యత్‌ సైతం ఓటర్లు నేడు నిర్ధారించనున్నారు. కాగా జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ముఖ్యనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ముమ్మర ప్రచారం చేశారు. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహించారు.(వారు పెళ్లి చేసుకోరు..కానీ మహిళలపై లైంగిక దాడులు!)

కాగా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ.. తుది విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసేందుకు 1347 పోలింగ్‌ స్టేషన్ల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని, రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్‌ ప్రజలకు ట్విటర్‌ వేదికగా విఙ్ఞప్తి చేశారు. ఇక శుక్రవారం పోలింగ్‌ జరుగుతున్న ఎన్నికల్లో 16 స్థానాలకు గానూ మొత్తం 237 మంది బరిలో నిలవగా... అందులో 29 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఈనెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top