
ఆర్ధికవేత్త జీన్ డ్రేజ్ (ఫైల్)
సాక్షి, రాంచీ: ప్రమఖ ఆర్థికవేత్త, విద్యావేత్త, హక్కుల కార్యకర్త జీన్ డ్రేజ్‌ను ఈ రోజు ఉదయం జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు అనుమతుల్లేకుండా ప్రజా సభ నిర్వహించినందుకు ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. డ్రేజ్‌తోపాటు మరో ఇద్దరు కూడా అరెస్టయ్యారు. తర్వాత వీరిని పోలీసులు వదిలేశారని సమాచారం. ఈ అరెస్ట్‌ను ఖండించిన వ్యవసాయ కార్యకర్త, రాజకీయ నాయకుడు యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ.. ‘తనకున్న పేరు, ప్రఖ్యాతులను వదిలేసి.. భారత పౌరసత్వం తీసుకొని, ఇక్కడి మురికివాడల్లోని పేద ప్రజలతో కలిసి నివసిస్తున్నారు జీన్ డ్రేజ్. అలాంటి ఆయనను అరెస్ట్ చేయడం సిగ్గుచేట’ని అన్నాడు. డ్రేజ్‌ది బెల్జియన్ దేశం. హక్కుల కార్యకర్తగా ఆకలి కేకలను వివరించే హంగర్ అండ్ పబ్లిక్ యాక్షన్ అనే పుస్తకాన్ని, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌తో కలసి డ్రేజ్ రాశారు. ప్రస్తుతం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డ్రేజ్ ఇంతకు ముందు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బోధించారు.