అన్న చిరంజీవిని కూడా వదిలేశాను: పవన్‌

Janasena Chief Pawan Kalyan Slams Chandrababu In Ananthapur - Sakshi

సాక్షి, అనంతపురం : నాకు కుటుంబ వ్యామోహం లేదని, అన్న చిరంజీవిని కూడా వదిలేశానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. అనంతపురం నగరం సప్తగిరి సర్కిల్‌ వద్ద జరిగిన సభలో పవన్‌ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా టీడీపీకి మద్ధతు ఇచ్చానని తెలిపారు. అమరావతిలో బలవంతపు భూసేకరణ చేయనని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారని చెప్పారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అని, ఒక్కో నియోజకవర్గంలో టీడీపీ నేతలు 1000 నుంచి రూ.3500 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. పంచాయతీకి పోటీ చేయలేని నారా లోకేష్‌ పంచాయతీ రాజ్‌శాఖకు మంత్రికావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఆంధ్రులు దోపిడీ దారులంటూ తెలంగాణ నేతలే రాష్ట్రాన్ని చీల్చారని వ్యాక్యానించారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆశ తనకు లేదని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారని, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నా స్వప్రయోజనాల కోసం చంద్రబాబు అమరావతి రావడం బాధాకరమన్నారు. నేను బీజేపీకి మద్ధతు ఇస్తున్నానంటూ చంద్రబాబు అనవసరంగా విమర్శిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. మోదీ అంటే నాకేం భయం లేదు..దమ్ముంటే మోదీని నాపై కేసులు పెట్టమనండి.. సంగతి తేలుస్తా అంటూ పవన్‌ సవాల్‌ విసిరారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అధికారులపై దాడులు, ప్రజలను భయభ్రాంతుకుల గురిచేయడం జేసీకి తగదన్నారు. జేసీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కరవు నివారణలో టీడీపీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లోకేష్‌ అవినీతిపై ఆధారాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే చంద్రబాబు స్పందించరని తెలిపారు. ప్రభుత్వం చేతిలో పోలీసులు ఆయుధంగా మారిపోయారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలు నన్ను హింసించారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ సర్కార్‌ను కూలదోస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ధృతరాష్ట్రుడిలా తయారయ్యారని, ఏపీలో దుశ్శాసనపర్వం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top