మైనారిటీలను ఏకం చేసి గెలిపిస్తాం

Jamaat-e-Islami Hind Support for TRS - Sakshi

     టీఆర్‌ఎస్‌కు జమాత్‌ ఎ హింద్‌ మద్దతు

     ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

     మైనారిటీలకు ఉప ప్రణాళిక కోసం విజ్ఞప్తి

     సానుకూలంగా స్పందించిన సీఎం 

     మేనిఫెస్టో కమిటీకి సీఎం ఆదేశాలు 

     నిజామాబాద్‌ సభ ఏర్పాట్లపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు జమాత్‌ ఎ హింద్‌ సంపూర్ణ మద్దతు తెలిపింది. జమాత్‌ ఎ హింద్‌ అధ్యక్షుడు హమీద్‌ మహ్మద్‌ఖాన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మైనారిటీలందరినీ ఏకం చేసి టీఆర్‌ఎఎస్‌ను గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆధ్వర్యంలో హమీద్‌ మహ్మద్‌ ఖాన్, ఇంజనీర్‌ అబ్దుల్‌ జబ్బార్‌ సిద్ధిఖీ, మాలిక్‌ మోతషామ్‌ ఖాన్, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు ఎండీ అజారుద్దీన్, ఎండీ సాదిక్‌ అహ్మద్, ఖాలిద్‌ జాఫర్, సయ్యద్‌ అబ్దుల్‌ బాసిత్‌ అన్వర్‌ తదితరులు సోమవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ముస్లిం వర్గాల అభ్యున్నతికి ఉపప్రణాళిక అమలు చేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఉపప్రణాళిక అంశాన్ని చేర్చాలని సూచించారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా 100 రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను కోరారు. ఇంటర్మీడియట్, డిగ్రీలలో ఉర్దూ భాష పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

మేనిఫెస్టోపై సీఎం కసరత్తు
జమాతే ఎ హింద్‌ నేతలు సీఎం కేసీఆర్‌కు కోరిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కె.కేశవరావుకు సూచించారు. మేనిఫెస్టో రూపకల్పన ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫోస్టో ఉండాలని చెప్పారు. మేనిఫెస్టో కమిటీ సమావేశాలు త్వరగా పూర్తి చేసి అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను చేర్చాలని సూచించారు.

తొలి భారీ బహిరంగసభ..
ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్‌ సమీక్షించారు. నిజామాబాద్‌ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవితలతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ ఇదే. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనే చర్చ జరిగేలా సభ జరగాలి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం నుంచి సభకు జనం వచ్చేలా అభ్యర్థులు చర్యలు తీసుకోవాలి’అని కేసీఆర్‌ సూచించారు.

అంగన్‌వాడీల మద్దతు..
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్న సంఘాల సంఖ్య పెరుగుతోంది. అంగన్‌వాడీ టీచర్ల సంఘం నేతలు 31 జిల్లాల బాధ్యులు సోమవారం నిజామాబాద్‌లోని ఎంపీ కవిత కార్యాలయానికి తరలి వచ్చారు. వేతనాలు పెంచి తమకు సమాజంలో గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాల మహానాడు నిజామాబాద్‌ జిల్లా సంఘంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మాల సంఘాల నేతలు కవితను కలసి టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. చిందు కళాకారులు సైతం ఇదే తరహాలో మద్దతు ప్రకటించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top