కోర్టుకెళ్తామంటే బీజేపీకి వ్యతిరేకమని కాదు: చంద్రబాబు

It is not against BJP: Babu - Sakshi

     కోర్టుకు వెళతామంటే బీజేపీని వ్యతిరేకించినట్లు కాదు 

     టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సుప్రీం కోర్టుకు వెళతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో వెంటనే మాట మార్చారు. కోర్టుకు వెళతామంటే బీజేపీని వ్యతిరేకించినట్లు కాదని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. ఆయన శనివారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు, ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చించారు.

విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే మనకున్న చివరి అవకాశం కోర్టుకు వెళ్లడం ఒక్కటేనని అన్నానని, ఇది బీజేపీకి వ్యతిరేకంగా కాదని గుర్తించాలని మంత్రులకు చెప్పారు. విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం మన హక్కని, అదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు.  తాను బీజేపీపై ఎందుకు పోరాటం చేస్తానని ప్రశ్నించారు.  అంతా బాగుందని విర్రవీగితే అసలుకే మోసం వస్తుందని, ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. 

పార్టీలో చేర్చుకున్న వారితో ఇబ్బందులు 
వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకునే అంశాన్ని ఒకరిద్దరు మంత్రులు లేవనెత్తగా.. ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న వారితో నియోజకవర్గాల్లో ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అందరినీ సర్దుబాటు చేయడం కష్టమని పేర్కొన్నట్లు తెలిసింది. స్థానికంగా సమస్యలు లేకపోతే ఎవరినైనా పార్టీలో చేర్చుకుందామని అన్నట్లు సమాచారం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top