breaking news
not against
-
బీజేపీపై పోరాటమెందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సుప్రీం కోర్టుకు వెళతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో వెంటనే మాట మార్చారు. కోర్టుకు వెళతామంటే బీజేపీని వ్యతిరేకించినట్లు కాదని చెప్పారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. ఆయన శనివారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రులు, ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చించారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే మనకున్న చివరి అవకాశం కోర్టుకు వెళ్లడం ఒక్కటేనని అన్నానని, ఇది బీజేపీకి వ్యతిరేకంగా కాదని గుర్తించాలని మంత్రులకు చెప్పారు. విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం మన హక్కని, అదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. తాను బీజేపీపై ఎందుకు పోరాటం చేస్తానని ప్రశ్నించారు. అంతా బాగుందని విర్రవీగితే అసలుకే మోసం వస్తుందని, ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీలో చేర్చుకున్న వారితో ఇబ్బందులు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకునే అంశాన్ని ఒకరిద్దరు మంత్రులు లేవనెత్తగా.. ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న వారితో నియోజకవర్గాల్లో ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అందరినీ సర్దుబాటు చేయడం కష్టమని పేర్కొన్నట్లు తెలిసింది. స్థానికంగా సమస్యలు లేకపోతే ఎవరినైనా పార్టీలో చేర్చుకుందామని అన్నట్లు సమాచారం. -
తెలంగాణకు వ్యతిరేకం కాదు
ఖమ్మం, న్యూస్‌లైన్:తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, ఇతర ప్రాంతాల వారి మధ్య విబేధాలు లేకుండా సమన్యాయం చేయాలనే పార్టీ కోరుకుంటోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గట్టు రాంచందర్‌రావు అన్నారు. వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో స్థానిక రిక్కాబజార్ పాఠశాల ఆవరణలో ఆదివారం జరిగిన కళాకారుల గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇడుపులపాయలో జరిగిన వైఎస్సార్సీపీ రా్రష్ట ప్లీనరీలోనే ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పామన్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలుగుదేశం మహానాడులో తెలంగాణ రాష్ట్రంపై ఈ ప్రాంత నాయకులు తమ వైఖరి వెల్లడించలేకపోయారని అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటివరకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ఘనత ఖమ్మం జిల్లా ప్రజలకు ఉందని అన్నారు. దాశరధి లాంటి సాయుధ పోరాట యోధులను కన్న ఖిల్లాగా జిల్లాకు పేరుందన్నారు. ఎన్ని పార్టీలు ఉన్నా ఎవరి విధానాలతో వారు ముందుకెళ్తారని, అయితే టీఆర్ఎస్ మాత్రం ఇతర పార్టీలను విమర్శంచడమే ధ్యేయంగా పెట్టుకుందని విమర్శించారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అఖిలపక్షం పెట్టి అందరి అభిప్రాయాలు అడుగుతున్న కాంగ్రెస్.. తన నిర్ణయం చెప్పకుండా ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ మహానేత మరణంతో గుండె ఆగిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన జగన్మోహన్రెడ్డిపై కుట్ర పూరితంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని అన్నారు. తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తున్న జగన్‌ను చూసి రాష్ట్ర ప్రజలు గర్వపడుతున్నారని, తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో జతకట్టిన బాలకృష్ణ, హరికృష్ణలను చూసి సిగ్గు పడుతున్నారని అన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆటపాటల ద్వారా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వైఎస్సార్ సీపీ విధి విధానాలు కళ్లకు కట్టినట్లు ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేస్తున్నారని అన్నారు. పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి మంటల నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అన్నారు. అందుకోసమే ప్రజలు వైఎస్ఆర్ను దేవుడిలా పూజిస్తున్నారని, గ్రామగ్రామాన ఆయన విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నారని చెప్పారు. దీనిని జీర్ణీంచుకోలేని వారు ఆ విగ్రహాలకు నిప్పుపెట్టడం, ధ్వంసం చేయడం వంటి చర్యలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. అలాంటి చర్యలకు పాల్పడితే తమ పార్టీ కార్యకర్తల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వైఎస్ ఏనాడో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారని, 2004లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకొని తన అభిమతాన్ని వ్యక్తం చేశారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ ఉంటుందని, దీనికి వైఎస్ కుటుంబ సభ్యులే నాయకత్వం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం మూడు జిల్లాల కన్వీనర్ సాధురమేష్‌రెడ్డి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ తోట రామారావు, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు యడవల్లి కృష్ణ, పాయం వెంకటేశ్వర్రావు, మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వర్రావు, అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెటి వెంకటేశ్వర్లు, బీసీసెల్ రాష్ట్ర నాయకులు మార్కం లింగయ్య, ప్రచార కమిటి కార్యవర్గ సభ్యులు జక్కం సీతయ్య, సేవాదళ్ నాయకులు దారెల్లి అశోక్, నాయకులు ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మందడపు వెంకటేశ్వర్లు,హెచ్ వెంకటేశ్వర్లు, బ్రహ్మారెడ్డి, జిల్లపల్లి సైదులు, తుమ్మ అప్పిరెడ్డి, షర్మిలా సంపత్, దామోదర్‌రెడ్డి, కొంగర జ్యోతిర్మయి. మైపా కృష్ణ, రేణుక, కృష్ణవేణి, కళాకారులు ప్రేమ్‌కుమార్, నందూ, డప్పు శ్రీను, కొమ్ము రమేష్, పాటూరి రాము, కాశి, లింగయ్య, చంద్రకళ, మానస పాల్గొన్నారు. -
తెలంగాణకు వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ లేదంటూ కొందరు నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని, అదంతా పూర్తి అవాస్తవమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్లమెంటు పరిశీ లకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర నేతలు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియా తో మాట్లాడారు. తెలంగాణలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉందని, కార్యకర్తలందరూ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే నాయకులు, ప్రజలు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎక్కువగా లబ్ధిపొందింది ఎక్కువగా తెలంగాణ ప్రాంతంవారేనన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన దీక్షకు తామంతా సంఘీభావం తెలుపుతున్నట్లు వివరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి పార్లమెంటు పరిశీలకుడు జంపన ప్రతాప్, ఉప్పల్ అసెంబ్లీ సమన్వయకర్త, కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సమన్వయకర్త శేఖర్‌గౌడ్ (మామ), రంగారెడ్డి జిల్లా యువజన విభాగం కన్వీనర్, కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కె.అమృతసాగర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.