కేబినెట్‌లో కేటీఆర్‌ ఉంటారా?

Intense debate on ktr in  cabinet place - Sakshi

మంత్రివర్గంలో ఆయన చోటుపై తీవ్ర చర్చ

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ కీలకపాత్ర

లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలూ ఆయనకే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించా లని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో కొత్త మంత్రుల జాబితాపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలు, కులాలవారీగా కేబినెట్‌లో చోటుపై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ నుంచి అధికారికంగా ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ‘ఇన్నా ళ్లూ మంత్రివర్గ విస్తరణ జరగడంలేదనే చర్చ ఉండేది. ఇప్పుడు తేదీ ఖరారు కావడంతో టెన్షన్‌గా ఉంది. కొత్త మంత్రుల జాబితా వెలువడే వరకు మా పరిస్థితి ఆగమాగమే’ అని రెండోసారి గెలిచిన మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సీఎం కార్యాలయం లేదా సాధారణ పరిపాలనశాఖ నుంచి ఫోన్లు ఏమైనా వచ్చాయా అని ఆశావహులు ఒకరికొకరు ఆరా తీస్తున్నారు. చర్చల తీరు ఎలా ఉన్నా సీఎం ఎంపిక చేసుకునే జట్టుపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంత్రివర్గంలో ఉంటారా లేదా అనే అంశంపై అధికార పార్టీతోపాటు రాజకీయ వర్గాలు, ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న కేటీఆర్‌ తాజా విస్తరణలో మంత్రిగా ప్రమాణం చేయబోరని తెలుస్తోంది. మంత్రిగా ఉంటూ టీఆర్‌ఎస్‌ బాధ్యతలు నిర్వహిస్తే ప్రజల్లో మరింత చేరువగా వెళ్లవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

పార్టీలో అంతా తానై.. 
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గతేడాది డిసెంబర్‌ 13న కేటీఆర్‌ నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ తర్వాత పార్టీపరంగా అంతా తానై వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక, అసమ్మతుల బుజ్జగింపు, ప్రచార సమన్వయం బాధ్యతలను నిర్వర్తించారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖ మంత్రిగా కేటీఆర్‌ పరిపాలనలో తనదైన ముద్రవేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తిం పు పొందారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్‌), ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులను కేటీఆర్‌ దిగ్విజయంగా నిర్వహించారు. ఆయా సదస్సుల్లో కేటీఆర్‌ చేసిన ప్రసంగాలకు విశేష ఆదరణ లభించింది. దేశ, విదేశాల్లో జరిగిన పారిశ్రామికవేత్తల సదుస్సుల్లో పాల్గొని రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో కేటీఆర్‌ కీలకపాత్ర పోషించారు. టీ–హబ్‌ ఐటీ ఇంక్యుబేటర్‌ రాష్ట్రంలో వందల సంఖ్యలో స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటుకు అంకురార్పణ అయ్యింది. ఇదే విధానాన్ని చాలా రాష్ట్రాలు సైతం అమలు చేశాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేటీఆర్‌ మొదట పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌కు మంత్రివర్గంలో చోటుపై స్పష్టత రావడంలేదు.  

టార్గెట్‌... లోక్‌సభ 
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 16 సీట్లు గెలుచుకొని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో కేటీఆర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. 16 ఎంపీ సీట్లలో విజయం, టీఆర్‌ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చడం లక్ష్యంగా కేటీఆర్‌ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాల నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి టీఆర్‌ఎస్‌ బలోపేతంపై ప్రత్యేక ప్రణాళిక రచించారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలను అమలు చేయాల్సిన నేపథ్యంలో కేటీఆర్‌ మంత్రిగా ప్రమాణం చేస్తారా అని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రిగా ఉంటూనే టీఆర్‌ఎస్‌ బాధ్యతలను నిర్వహిస్తే కేటీఆర్‌ నిర్ణయాల అమలు వేగంగా జరుగుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్‌ తీసుకునే నిర్ణయం కోసం గులాబీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top