కర్ణాటక స్ఫూర్తితో..

inspired By Karnataka Opposition Leaders Meet Governors In Bihar, Goa And Manipur - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో గోవా, బిహార్‌, మణిపూర్‌లో విపక్ష నేతలు శుక్రవారం తమ గవర్నర్లను కలిసి ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ చెల్లకుమార్‌ నేతృత్వంలో 13 మంది పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ మృదులా సిన్హాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తమదే ఏకైక అతిపెద్ద పార్టీ అని గవర్నర్‌కు వివరించారు. తమకు అవకాశమిస్తే అసెంబ్లీలో వారం రోజుల్లో మెజారిటీ నిరూపించకుంటామని గోవా కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కర్ణాటకలో మాదిరిగా అతిపెద్ద ఏకైక పార్టీ అయిన తమనూ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. బిహార్‌లోనూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, కాంగ్రెస్‌, సీపీఐ-ఎంఎల్‌ సభ్యులు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

బిహార్‌ అసెంబ్లీలో ఆర్జేడి అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించిన మీదట ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలు గవర్నర్‌కు లేఖలు సమర్పించాయి. తెరవెనుకగా గద్దెనెక్కిన నితీష్‌ విధానాలతో బిహార్‌ ప్రజలు విసుగెత్తిపోయారని తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామన్నారు. ఇక మణిపూర్‌లోనూ కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం తాత్కాలిక గవర్నర్‌ జగదీష్‌ ముఖిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. మణిపూర్‌లో కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్నందున రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top