ఐటీ సోదాలు ఉత్తుత్తివే!?

Income Tax Raids at TDP Leader House Are Fake, Experts Raise Doubts - Sakshi

ఎంపీ సీఎం రమేష్‌ ఇంట్లో పోలీసు తనిఖీలూ అంతే

 కేవలం ఇద్దరు పోలీసులతో సోదాలు..

ఐటీ అధికారులు వెనుదిరగడం.. పోలీసులకు వారు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు

 నమ్మశక్యంగా లేవంటున్న రాజకీయ విశ్లేషకులు

సాక్షి ప్రతినిధి కడప : వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇంట్లో ఐటీ సోదాలు.. ఎంపీ సీఎం రమేష్‌ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. వీటిపై ఇప్పుడు పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నిజంగా జరిగాయా.. లేక వారే కావాలని చేయించుకుని డ్రామా ఆడుతున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో బుధవారం సాయంత్రం ఐటీ అధికారులు తనిఖీలకు వెళ్లారు. ఇరువురు పోలీసులను మాత్రమే బందోబస్తుకు తీసుకెళ్లారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు సుధాకర్‌ తనయుడుతో కబుర్లలో మునిగిపోవడం, ఈలోపు సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితర టీడీపీ నేతలు అక్కడి చేరుకోవడం.. తనిఖీలు చేయాలని ఎవరు అదేశించారో చెప్పాలంటూ నానాయాగీ చేశారు. దీంతో ఐటీ అధికారులు వెనుతిరగడం అనుమానాలకు ఆస్కారమిచ్చింది. పైగా.. విధులకు ఆటంకం కల్గించినట్లు వారు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. 

సానుభూతే లక్ష్యంగా ఐటీ తనిఖీలు
మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీమంత్రి రవీంద్రారెడి ్డకలిసికట్టుగా  పనిచేస్తే అక్కడ మరే అభ్యర్థి అయినా నామమాత్రపు పోటీ ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల్లో పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇంట్లో ఐటీ సోదాలకు టీడీపీ పెద్దలు స్కెచ్‌ వేసినట్లు సమాచారం. సానుభూతి కోసమే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. 

సీఎం రమేష్‌ ఇంట్లోనూ ఇంతే..
సుధాకర్‌యాదవ్‌ ఇంట్లో జరిగిన సంఘటనకు రెండ్రోజుల అనంతరం శుక్రవారం ఎంపీ సీఎం రమేష్‌ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోట్లదుర్తి గ్రామంలో యర్రగుంట్ల సీఐ వెంకటరమణ నేతృత్వంలో ఇవి జరిగాయి. వాస్తవానికి ఎంపీ స్థాయి ఇంట్లో తనిఖీలు చేయాలంటే కనీసం డీఎస్పీ స్థాయి అధికారి వెళ్లాలి. కానీ, యర్రగుంట్ల సీఐ తన పై అధికారులైన  ఎస్పీ అభిషేక్‌ మహంతి, డీఎస్పీ మాసూం బాషాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా, కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల వైఎస్సార్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు. సీఎం రమేష్‌ సిఫార్సుల కారణంగానే ఆయన ఇక్కడకు వచ్చారని.. ఎంపీ వ్యూహంలో భాగంగానే వెంకటరమణ తనిఖీలకు వెళ్లినట్లు తెలుస్తోంది.  అయినా, టీడీపీ నేతలు జిల్లా పోలీసు శాఖను, ఎన్నికల కమిషన్‌ను టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తుంటే.. టీడీపీ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు, పోలీసుల తనిఖీలు చోటుచేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top