
సాక్షి, పాలకొల్లు : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గురువారంద జనసంద్రంగా మారింది. రాజన్న తనయుడి చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. పాలకొల్లు చేరుకున్న వైఎస్ జగన్‌కు నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘు రామ కృష్ణంరాజు, పాలకొల్లు వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ, స్థానిక నేతలు శేషు బాబు, నరసాపురం ఆచంట అభ్యర్థులు ప్రసాద రాజు, రంగనాథ రాజు తదితరులు స్వాగతం పలికారు.
మరోవైపు వైఎస్ జగన్ ఏపీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రోజుకు నాలుగు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ పర్యటన కొనసాగనుంది. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా నుంచి చింతలపూడి చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా వినుకొండలో, కృష్ణా జిల్లా నందిగామలోనూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ సభల ద్వారా... నవరత్నాల పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే... ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను తెలియజేస్తున్నారు.