‘తిత్లీ’ బాధితులను ఆదుకుంటాం: హోంమంత్రి

Home Minister Mekathoti Sucharitha Reply on Titli Cyclone Victims - Sakshi

సాక్షి, అమరావతి: తిత్లీ తుఫాన్‌ బాధితులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. గత ఏడాది సంభవించిన తిత్లీ తుఫాన్‌ ధాటికి ఉత్తరాంధ్ర జిల్లాలు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హోంమంత్రి సుచరిత గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. తీత్లీ తుఫాన్‌ వల్ల భారీ నష్టం జరిగిందని, ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాకు భారీగా నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు. జిల్లాలోని 31 మండలాల్లో భారీ నష్టం సంభవించిందని, 48వేలకుపైగా గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. తిత్లీ తుఫాన్‌ బాధితుల పరిహారానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని తెలిపారు. తుఫాన్‌తో దెబ్బతిన్న 18 ఇళ్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే తిత్లీ తుఫాన్‌ బాధితులకు అందజేసిన సాయం వివరాలను తెలిపారు. 

పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు తిత్లీ తుఫాన్‌ అంశంపై సభలో మాట్లాడారు. తిత్లీ తుఫాన్‌ ధాటికి వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపారు. దీంతో ఇళ్లు కోల్పోయి ఎంతోమంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాన్‌ సంభవించిన అనంతరం నాలుగైదు రోజులైనా వాటర్‌ ట్యాంక్‌లు బాధిత గ్రామాలకు రాలేదని, ఏడు రోజులైనా జనరేటర్లు ప్రభుత్వ యంత్రాంగం పంపించలేదని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉండగా.. టీడీపీ నేతలు మాత్రం తాము తిత్లీ బాధితులను ఆదుకున్నట్టు విస్తృత ప్రచారం చేసుకున్నారని అప్పలరాజు మండిపడ్డారు. పరిహారం కావాలని అడిగిన బాధితులపై అప్పటి సీఎం చంద్రబాబు కేసులు పెట్టించారని తెలిపారు. తిత్లీ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు పర్యటించి.. సహాయక చర్యలను పర్యవేక్షించారని చెప్పారు. తిత్లీ తుఫాన్‌ బాధితులను పూర్తిగా ఆదుకోవాలని అప్పలరాజు ప్రభుత్వాన్ని కోరారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top