
సాక్షి, సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా... కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు. సోమవారం ఆయన సంగారెడ్డిలో కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ పేదలకు 12కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు ఇచ్చారని గుర్తు చేశారు.పేదలకు కేంద్రం ఎలాంటి సహాయం చేయడంలేదని విమర్శించారు. ఇలాంటి కష్టకాలంలో అప్పులు తీసుకునేందుకు కూడా కేంద్రం షరతులు విధించడం దారుణమన్నారు. కష్టకాలంలో ఇలా షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.