‘టీడీపీని విలీనం చేస్తానంటే అధిష్టానంతో మాట్లాడతా’

GVL Narasimha Rao Interesting Comments On TDP Merge BJP - Sakshi

సాక్షి, విజయవాడ : ఓడిపోయిన పార్టీ నుంచి పది మంది నాయకులు వస్తే తమ పార్టీ బలపడదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. కొందరు రాజకీయ భవిష్యత్‌ కోసం బీజేపీలో చేరుతున్నారని అలాంటి వారితో పార్టీ బలపడదని స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన జీవీఎల్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ అంటే విశ్వసనీయత, సిద్దాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర ఏముందని ఆయనతో కలిసి ముందుకు వెళతామని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, ఆ పార్టీ లోక్‌సభ సభ్యులు బీజేపీకి అవసరం లేని సమయంలో టీడీపీతో ఎందుకు కలుస్తామన్నారు. భవిష్యత్‌ గురించి భయపడే చంద్రబాబు కేంద్రంతో విభేదించమని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూశారని మండిపడ్డారు. జీవీఎల్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..  

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
‘చంద్రబాబును మేము భయపెట్టడం లేదు. అవినీతి ఎవరు చేసిన శిక్ష తప్పదు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ మాటలకు భుజాలు తడుముకొంటే మేము ఏమి చేయలేము. పోలవరంలో అవినీతి జరగలేదని మా పార్టీ నేతలు ఎవరూ చెప్పలేదు. పోలవరంలో దాదాపు రూ. 2200 కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. దానిపై రివర్స్ టెండరింగ్ వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. పోలవరం, అమరావతిలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పు తీసుకోవడం తప్పుకాదు, దాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం దుర్వినియోగం చేయడం చేయడం తప్పు. అప్పు చేసిన చంద్రబాబు పసుపు కుంకుమ కింద ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. 

టీడీపీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం ఉంటే చెప్పండి
గతంలో చంద్రబాబు పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడిగాము. వాటికి చంద్రబాబు లెక్కలు చెప్పలేదు. ఖర్చు చేసిన నిధులకు చంద్రబాబు లెక్కలు ఎందుకు చెప్పలేక పోతున్నారో అర్ధం కావడం లేదు. చంద్రబాబుకు బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఉద్దేశం ఉంటే నేను మా అధిష్టానంతో మాట్లాడుతాను. సుజనా చౌదరి చంద్రబాబు గురించి అమిత్ షా తో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మోదీని చాలా నీచంగా చంద్రబాబు తిట్టారు. దేశంలో ఏ నాయకుడు తిట్టని విధంగా తిట్టారు. రుణాలు ఎగవేత విషయంలో ఎవరు తప్పించుకోలేరు.  దీనికి సుజనాచౌదరి కూడా అతీతుడు కాదు. అందరిలాగే సుజనాచౌదరి కూడా బ్యాంక్‌లకు రుణాలు కట్టాల్సిందే. ఆయన బీజేపీలో చేరినంత మాత్రాన ఎలాంటి మినహాయింపు ఉండదు

ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీనే
గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఆసక్తి ఉండేది. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపిలు బీజేపీకి కనీస పోటీ ఇవ్వలేక పోతున్నాయి. దీంతో మహారాష్ట్రతో పాటు హరియాణలో బీజేపీ గెలవడం తథ్యం. తెలుగు రాష్ట్రాల్లో కూడా బలపడాలనే దాని మీద దృష్టి పెట్టాము. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సమస్యలు మీద దృష్టి పెట్టాము. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. రాష్ట్రానికి మరిన్ని నిధులు జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జలజీవన్ మిషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తాము. 

రద్దు చేస్తారని ఎవరూ ఊహించలేదు
గతంలో 55 శాతం గ్రామాలకు రోడ్లు ఉంటే మోదీ హయాంలో 90 శాతం గ్రామాలకు రోడ్లు వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రధాని 370 ఆర్టికల్ రద్దు చెస్తారని ఎవరూ ఊహించలేదు. 370 ఆర్టికల్ ను ప్రపంచ సమస్యగా చూపించే ప్రయత్నం పాకిస్థాన్ చేసింది. అయితే ప్రపంచ దేశాలు మద్ధతు భారతదేశం కు లభించేలా మోదీ చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది’ అంటూ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top