
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం.. రూ.వేల కోట్ల అవినీతి.. అడుగడుగునా నాణ్యత లోపాలు.. ఒక్క రోజులో కాంక్రీట్ మిశ్రమంతో పూతేసే నాటకానికి సీఎం చంద్రబాబు తెరతీశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలవరం వేదికగా గిన్నిస్ రికార్డు పేరుతో నాలుగున్నరేళ్ల అక్రమాలను మరిపించేందుకు సరికొత్త డ్రామాలు మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టు పనులను కనీసం ప్రాథమిక స్థాయిని కూడా దాటించలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటిలానే సోమవారం గిన్నిస్ రికార్డ్ పేరుతో మరో నాటకాన్ని సీఎం ప్రదర్శించారు. డిసెంబర్ 15 నుంచి ఈనెల 5దాకా పోలవరం స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్‌లో ఒకే రోజు 28 వేల నుంచి 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మిశ్రమాన్ని పోయడానికి వీలుగా సెంట్రింగ్, షట్టరింగ్ వంటి పనులను పూర్తి చేశారు.
ఇనుప కడ్డీలతో చేసిన సెంట్రింగ్, షట్టరింగ్‌ను ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 31,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మిశ్రమంతో నింపే పనులు చేపట్టారు. దీనికి ‘గిన్నిస్ బుక్’ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. రికార్డుల కోసం ప్రయత్నం చేయడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. అయితే ఆ రికార్డును సీఎం చంద్రబాబు తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వినియోగించుకోవడంపై జలవనరుల శాఖ అధికారవర్గాలే తప్పుపడుతున్నాయి. దశాబ్దాల కల.. పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేశారు. 2009 వరకూ రూ.5,135.87 కోట్లతో 40 శాతానికిపైగా పనులను పూర్తి చేశారు. టీడీపీ సానుభూతిపరులైన ‘కొందరు’ రైతులను భూసేకరణకు సహకరించకుండా కోర్టులను ఆశ్రయించేలా పురిగొల్పిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పనులను అడ్డుకోవడానికి కుట్ర చేశారు. నాడు కోర్టులను ఆశ్రయించిన రైతులకు 2014లో అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.52 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో ఆ కుట్రలు బట్టబయలయ్యాయి.
కమీషన్‌లే పోలవరానికి శాపం..
విభజన చట్టం మేరకు పోలవరాన్ని తామే నిర్మించి ఇస్తామని 2014లో కేంద్రం వాగ్దానం చేసింది. అయితే చంద్రబాబు కమీషన్‌ల కక్కుర్తితో 2015లో గోదావరి కుడిగట్టుపై రూ.1667 కోట్లతో పట్టిసీమ.. 2016లో ఎడమగట్టుపై రూ.1638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టారు. 2009 నాటికే దాదాపు పూర్తయిన పోలవరం కుడి కాలువలోకి పట్టిసీమ ఎత్తిపోతల గోదావరి జలాలను ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువలోకి నీటిని ఎత్తిపోసి ఏలేరు రిజర్వాయర్‌కు తరలించారు. పోలవరం పూర్తయితే ఈ రెండు ఎత్తిపోతల పథకాలు వృథా. అంటే రూ.3,305 కోట్ల ప్రజాధనం వృథా. పైగా ఏటా విద్యుత్ బిల్లుల రూపంలో కనిష్ఠంగా రూ.1200 కోట్లు అదనపు భారం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెప్టెంబరు 8, 2016దాకా పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం)లో తట్టెడు మట్టి ఎత్తకుండా అడ్డుపడ్డారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న తర్వాత అంటే సెప్టెంబరు 8, 2016 నుంచే హెడ్ వర్క్స్ పనుల్లో కదలిక వచ్చింది. అంచనా వ్యయాన్ని పెంచేసి.. పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి భారీ ఎత్తున కమీషన్‌లు దండుకున్నారు. కమీషన్‌లకు కక్కుర్తి పడకుండా 2014 నుంచే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు వెచ్చించిన నిధులను కూడా పోలవరంపై ఖర్చు పెట్టి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పాక్షికంగా పూర్తయ్యేది. గ్రావిటీపై కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉండేది. వీటిని పరిశీలిస్తే సీఎం చంద్రబాబు కమీషన్‌ల కక్కుర్తి పోలవరానికి శాపమైందన్నది స్పష్టమవుతోంది.
వారానికో వర్చువల్ రివ్యూ.. నెలకో రియాలిటీ షో
పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి సీఎం చంద్రబాబుకు లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి. ప్రతి సోమవారం వర్చువల్ రివ్యూ.. నెలకు ఒక సారి క్షేత్ర స్థాయి పర్యటనతో షోయింగ్‌లూ, మూణ్నెళ్లకో డ్రామాలాడుతూ ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నా శరవేగంగా సాగుతున్నట్లు ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ హెడ్ వర్క్స్‌లో కీలకమైన 18 డిజైన్‌ల అతీగతీ లేకపోవడాన్ని అధికారవర్గాలే ఎత్తిచూపుతున్నాయి. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే.. పనులు చేయడానికి అత్యంత కీలకమైన డిజైన్‌లను కేంద్ర జలసంఘంతో ఎందుకు ఆమోదింపజేసుకోలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. భారీ ఎత్తున కమీషన్‌లు వసూలు చేసుకోవడానికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కేంద్రంపై సీఎం ఒత్తిడి తెచ్చారేగానీ.. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదని జలవనరుల శాఖ అధికారవర్గాలే చెబుతున్నాయి.