కూటమి..ఖుషీ

Great Alliance Happy With Sonia Gandhi Visit - Sakshi

మేడ్చల్‌ సోనియా సభ సక్సెస్‌  

కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం

యువతను ఆకట్టుకున్న రాహుల్‌గాంధీ

నియంత పాలనను తిప్పికొట్టాలని విజ్ఞప్తి

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: సోనియా సభ గ్రేటర్‌ పరిధిలోని కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 6.40కు మేడ్చల్‌లోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అరగంటకు పైగా సాగిన సోనియా ఉత్కంఠ భరిత ఉపన్యాసం ప్రజాకూటమి నేతలతో పాటు కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. సోనియా రాక సందర్భంగా హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా జనం వచ్చారు. బహిరంగ సభ ముగుస్తున్నప్పటికీ 2కి.మీ దూరంలో ఉన్న కిష్టాపూర్‌ పరిధిలో ఉన్న వాహనాల పార్కింగ్‌ ప్రాంతం నుంచి జనం కదలిరావడం కనిపించింది.

సోనియా వచ్చిన అరగంట తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభాస్థలికి చేరుకున్నారు. వేదికపై ప్రజాకూటమి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆసీనులయ్యారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, అభ్యర్థులు కేఎల్‌ఆర్, కూన శ్రీశైలంగౌడ్‌తో పాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సోనియాను ఘనంగా స్వాగతించిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌ తన పాటతో సభికులను ఉత్తేజపరిచారు. 

సోనియా ప్రసంగంతో కాంగ్రెస్‌లో ఆశలు
మేడ్చల్‌ బహిరంగ సభలో సోనియా గాంధీ చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఆశలు పెంచింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని కల్పించింది. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల ఉద్యమ ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందని సోనియా తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌కు ఇబ్బంది ఎదురైన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు సోనియా ప్రకటించడంపై సభికులు హర్షం వ్యక్తం చేశారు. ఒక తల్లి తన బిడ్డల అభివృద్ధిని ఎలా కోరుకుంటుందో రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్‌ అలాగే కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించడంతో పాటు ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని తీవ్రంగా విమర్శించారు.

యువతలో రాహుల్‌ ‘జోష్‌’  
రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగం యువతలో జోష్‌ నింపింది. 20 నిమిషాలకు పైగా సాగిన ఆ ప్రసంగంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్‌ ప్రస్తావించారు. కేసీఆర్‌ ఒక్కరే రాష్ట్రాన్ని నిరంకుశ«ంగా పాలించిన తీరును ఎండగట్టారు. కేసీఆర్‌ పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్, టీటీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజా కూటమిగా ఏర్పడ్డాయని, ప్రజలు అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సోనియాకు ఘన సత్కారం  
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా తొలిసారిగా మేడ్చల్‌కు విచ్చేయడంతో పార్టీలు, ప్రజా సంఘాలు ఆమె శాలువాతో ఘనంగా సత్కరించాయి. ఈ సత్కారంలో కాంగ్రెస్‌ నేతలు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమ కుమారి, విద్యార్థి సంఘాల నుంచి అరుంధతిరాయ్, రాజారాం, లంబాడి, గిరిజన సంఘాల నుంచి రవింద్రనాయక్, దళిత, ఎమ్మార్పీఎస్‌ సంఘాల నుంచి మంద కృష్ణ మాదిగ, తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నుంచి దామోదర్‌రెడ్డి, మైనార్టీ సంఘాల నుంచి షబ్బీర్‌ అలీ, టీజేఎస్‌ నుంచి కోదండరామ్, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top