ఆర్టీసీ సమ్మె శాశ్వత  పరిష్కారాలపై దృష్టి పెట్టాలి

Government Should Focus On Permanent Solution For TSRTC Strike Says K Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కంటే  శాశ్వత పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీజేపీ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్‌ సూచించారు.ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తి సంఘీభావం తెలుపుతోందన్నారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తాం, ఉద్యోగాల నుండి తొలగిస్తాం అంటూ బెదిరించడం సరైంది కాదన్నారు.కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.   రాష్ట్రంలో పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిన పర్యవసానంగానే ఆర్టీసీ సమ్మె చోటుచేసుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు.  డిమాండ్లను పరిష్కరించి సమ్మెకు తెరదించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తిచేశారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నారని, అదేపద్ధతిలో  కేసీఆర్‌కూడా  విలీన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికసంఘాల జేఏసీతో చర్చించి సమ్మె పరిష్కారం ద్వారా ప్రజలు దసరా పండగ జరుపుకునే విధంగా చొరవ తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top