అలా అయితే జిలేబీలు తినడమే మానేస్తా : గంభీర్‌

Gautam Gambhir Says If He Eating Jalebi Cause Delhi Pollution Quit Jalebis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య అంశంపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకపోడంతో టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై గౌతమ్‌ గంభీర్‌ సోమవారం తనదైన శైలీలో స్పందించారు. తాను జిలేబీలు తినడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుదంటే అవి తినడమే మానేస్తానని చెప్పారు. 

అసలు ఏం జరిగిందంటే..
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం అంశంపై పార్లమెంట్‌ ప్యానెల్‌ గత శుక్రవారం  సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి గంభీర్‌ డుమ్మా కొట్టి, ఇండోర్‌లో జరిగిన భారత్‌, బంగ్లాదేశ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కి వెళ్లాడు. అక్కడ వీవీఎస్ లక్ష్మణ్, జతిన్ సప్రూలతో జిలేబీ తింటూ ఆహ్లాదంగా గడిపాడు. ఈ ఫోటోలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై ఆమ్‌ఆద్మీ శ్రేణులు మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే గంభీర్‌ మాత్రం ఇండోర్‌కి వెళ్లి జిలేబీలు తింటూ ఎంజాయ్‌ చేస్తున్నాడని విమర్శించారు.  ఎంజాయ్‌ చేయడం ఆపి వాయు కాలుష్యంపై జరిగే సమావేశాల్లో హాజరుకావాలంటూ చురకలు అంటించారు. ఆదివారం మరో అడుగు ముందుకేసి ‘గౌతమ్‌ గంభీర్‌ కనిపించడం లేదు’  అంటూ పోస్టర్లు వేయించారు. . ‘మీరు ఈ వ్యక్తిని చూశారా? చివరిసారిగా ఇండోర్‌లో స్నేహితులతో కలిసి జిలేబీలు తింటూ కనిపించాడు. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతోంది’ అని రాసి ఉన్న  పోస్టర్లు, బ్యానర్లు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఉంచారు.

దీనిపై గౌతమ్‌ స్పందిస్తూ..‘ ఒకవేళ నేను జిలేబీలు తినడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని భావిస్తే.. ఈ క్షణం నుంచే అవి తినడం మానేస్తా. నన్ను ట్రోల్‌ చేయడానికి కేటాయించే సమయాన్ని కాలుష్య నివారణ అంశాలపై కేటాయిస్తే ఇప్పుడు మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేవాళ్లం’  అని పరోక్షంగా ఆప్‌ నేతలను విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top