వారికి అదే సమాధానం చెబుతుంది: గంభీర్‌

Gautam Gambhir Counter To AAP Says His Work Will Speak For Itself - Sakshi

ఆప్‌ నేతల విమర్శలకు గంభీర్ కౌంటర్‌

న్యూఢిల్లీ : ఎంపీగా నియోజకవర్గం పట్ల తనకున్న చిత్తశుద్ధి గురించి అక్కడ తాను చేసిన అభివృద్ధే మాట్లాడుతుందని టీమిండియా మాజీ క్రికెటర్‌, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలకు అదే సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రతరమైన నేపథ్యంలో.. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్యానెల్‌ శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్‌ కామెంట్రీ నిమిత్తం గంభీర్‌ ఇండోర్‌లో ఉండటంతో ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అదే విధంగా ఈ సమావేశంలో కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే పాల్గొనడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ప్యానెల్‌.. భేటీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో జిలేబీలు తింటున్న గంభీర్ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆప్‌ నాయకులు.. గంభీర్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. 

ఈ విషయంపై స్పందించిన గౌతం గంభీర్‌ ట్విటర్‌ వేదికగా వారికి కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు... ‘ నా నియోజకవర్గం, పట్టణంలో జరిగే అభివృద్ధిని చూసి నా గురించి మాట్లాడాలి. ఘాజీపూర్‌లో స్వచ్ఛత కోసం అత్యాధునిక కంపోస్టు యంత్రాలు పెట్టించాం. ఈడీఎంసీ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాసులు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేశాం. మహిళల కోసం పాడ్‌ వెండింగ్‌ యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చాం. పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఉచిత భోజన సదుపాయం కల్పించాం. రాబోయే నాలుగున్నరేళ్లలో నేను చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల్లో ఇవి కేవలం ఒక శాతం మాత్రమే. నాకు ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. గత ఆర్నెళ్లుగా నావైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వలేదు. 

అంతేకాదు రోజూ ఉదయం పదకొండు గంటల నుంచి తూర్పు ఢిల్లీలోని నా కార్యాలయంలోనే కూర్చుంటాను. ప్రజల సమస్యలు నా దృష్టికి వచ్చాయని వారు భావించిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తాను. ఎంపీ ల్యాడ్‌ నిధుల కిందే కాకుండా నా జీతం ద్వారా వచ్చే డబ్బును కూడా ప్రజా సంక్షేమానికే వినియోగిస్తానని ప్రతిఙ్ఞ చేశాను. వాయు కాలుష్యం పెరగిన నేపథ్యంలో రాబోయే రెండు వారాల్లో నా నియోజకవర్గంలో ఎయిర్ ఫ్యూరిఫయర్లతో పాటుగా కాలుష్యాన్ని తగ్గించే సాంకేతికతపై చర్చించి.. పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టబోతున్నాం. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించడం కోసం కాదు. రాజకీయాల్లోకి రాకముందే వ్యాపార ప్రకటనల ద్వారా సంపాదించాను. దీనిని కొంతమంది రాజకీయం చేయడం విచారకరం. ఏదైమైనా నా నియోజకవర్గ, పట్టణ, దేశ ప్రజలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా పనిని చూసే వారు నా చిత్తశుద్ధి గురించి మాట్లాడతారు. ‘నిజాయితీపరుడి’గా చెప్పుకొనే ఢిల్లీ ముఖ్యమంత్రి అనుచరుల తప్పుడు ప్రచారాన్ని వారు ఎన్నటికీ విశ్వసించరు’అని సుదీర్ఘ లేఖను పోస్టు చేశారు. (చదవండి : ‘జిలేబీలు తినడం ఆపి సమావేశాల్లో పాల్గొనండి’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top