వాళ్లపై వేటు వేసి మాట్లాడండి మిస్టర్‌ స్పీకర్‌! 

Gadikota Srikanth Reddy comments on Speaker  - Sakshi

వేటు వేయకుండా సభకు రమ్మని ఫోన్లా?

ఈ డ్రామాలు ఆపండి స్పీకర్‌ గారు

అంకెల గారడీ, అబద్దాలతో గవర్నర్‌ ప్రసంగం

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి  

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు.. గవర్నర్‌ నరసింహన్‌తో పచ్చి అబద్దాలు చెప్పించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేసినవి ఏమైనా ఉంటే అవి అవినీతి, మోసం, దగా, అన్యాయం మాత్రమేనని ధ్వజమెత్తారు. జపాన్, సింగపూర్‌ కంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలో ఇంకా మూడొంతుల మంది ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నారని ప్రశ్నించారు. అసత్యాలతో కరపత్రాన్ని రాయించి గవర్నర్‌తో చదివించడం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య మూలసూత్రాలపై ఏమాత్రం నమ్మకం లేని చంద్రబాబు.. గవర్నర్‌తో ఎన్‌టీఆర్‌ ఎప్పుడో చెప్పిన ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అనే మాటను చెప్పించడం సిగ్గుచేటన్నారు.

రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేసి వారిలో నలుగుర్ని మంత్రులుగా చేసి కొనసాగిస్తున్న అసెంబ్లీని దయ్యాల కొంప అనుకోవాల్సిందేనా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్‌ చక్కగా డ్రామా నడిపిస్తున్నారని, పదే పదే ఫోన్లు చేసి ప్రతిపక్షాన్ని ఆహ్వానిస్తున్నానని డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా కొనుగోలు చేసిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అదే గంటలో అసెంబ్లీకి వస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలకు బుధవారం ఆమోదం తెలిపిన స్పీకర్‌కు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు లేఖలు ఇస్తే పట్టించుకోలేదన్నారు. స్పీకర్‌ తన పోస్టుకు విలువ ఇవ్వకుండా పార్టీ కండువా వేసుకుని పార్టీ మీటింగ్స్‌లో మాట్లాడుతూ.. సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్నారు. నాలుగేళ్లు ఎన్‌డీఏలో కొనసాగిన చంద్రబాబుకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పుకుంటున్న అభివృద్ధి రేటు పచ్చి అబద్దమన్నారు. ఉత్పత్తి రంగంలో దేశవ్యాప్తంగా 16.7 శాతం అభివృద్ధి ఉంటే ఏపీలో 9.66 శాతం ఉందని చెప్పారని, అంత వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సర్వీస్‌ సెక్టార్‌లో 44 శాతం అభివృద్ధి ఎలా సాధించిందో చంద్రబాబుకే తెలియాలని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంలో కూడా ఆహార ఉత్పత్తులు గతంలో కంటే కూడా బాగా తగ్గాయన్నారు. వ్యవసాయాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తన చుట్టూ ఉన్న ప్రజల అభివృద్ధి కోరుకోవాలని కానీ, ఎక్కడో నక్షత్రాల్లో అభివృద్ధి అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో విఫలమై.. ఇప్పుడు 2050 విజన్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిరహితంగా ఏపీ పాలన ఉందని చెప్పించడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఐదేళ్లలో బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఎక్కువగా దోపిడీ చేశారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top