మోదీ @4

Four Years For Narendra Modi Government Achievements and Failures - Sakshi

బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం  నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టనుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే వచ్చే ఏప్రిల్,మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు కొన్ని నెలలు ముందుగానే అంటే ఈ ఏడాది చివర్లోనే జరగొచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రాంతీయ, తదితర పార్టీల మధ్య కొనసాగుతున్న అనైక్యత కాస్తా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొంత సయోధ్య కుదిరే దిశకు మళ్లింది.

నాలుగేళ్ల క్రితం అధికారాన్ని చేపట్టినపుడు బీజేపీ ఇచ్చిన ‘అచ్చేదిన్‌’,‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’ వంటి ఆకర్షణీయమైన నినాదాల అమలు ఏమైందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2022 వరకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండింతలు, ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన,  అవినీతిరహిత పాలన వంటి ప్రధాన అంశాలను లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ధరలతో పాటు  పెట్రోఉత్పత్తుల ధరలు గరిష్టస్థాయికి చేరుకోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల లేమి, శాంతి,భద్రతల సమస్య వంటివి ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్‌ 48 ఏళ్ల పాలనతో పోల్చితే మోదీ ప్రభుత్వం 48 నెలల్లో సాధించిన విజయాలంటూ బీజేపీ కార్యాచరణను చేపట్టనుంది. 

విజయాలు :

  • విద్యుత్‌రంగంలో సాధించిన విజయాలు. అన్ని గ్రామాలకు విద్యుత్‌ కనెక్షన్లు,రోజుకు 28 కి,మీ మేర రోడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ వంటివి బీజేపీ ప్రభుత్వ విజయాల్లో భాగంగా ఉన్నా... ప్రధానంగా 
  • జీఎస్‌టీ :గత పదేళ్లుగా కసరత్తు జరుగుతున్నా గతేడాది  జులైలో వస్తు,సేవా పన్ను (జీఎస్‌టీ) విధానం అమలు. తొలిదశలో దీని అమల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ప్రత్యక్ష పన్నుల విధానం  ద్వారా మేలు చేకూరింది.
  • విదేశీ విధానం : ప్రధానిగా మోదీ 53 దేశాల్లో పర్యటించారు. ఈ విదేశీ పర్యటనలపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. చైనా తదితర దేశాలతో మిత్రత్వం సాధించగలిగారు. డోక్లామ్‌ వద్ద చైనాతో తలెత్తిన ఘర్షణలు నెమ్మదిగా సమసిపోయాయి.  అయితే జమ్మూ,కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌తో సమస్య అలాగే కొనసాగుతోంది. దాయాది దేశం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారడంతో అక్కడ ఉద్రిక్తతలు సాగుతున్నాయి.
  • ఆర్థిక ఎగవేతదారుల బిల్లు : దేశంలోని బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు చెక్కేసిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, తదితరుల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విమర్శలొచ్చాయి. అయితే విదేశాలకు పారిపోయిన ఈ ఎగవేతదారుల ఆస్తుల స్వాధీనానికి గత ఏప్రిల్‌లో తీసుకొచ్చిన చట్టం ప్రశంసలు అందుకుంది. 
  • అవినీతిరహిత ముద్ర : మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు రాలేదు. అందుకు భిన్నంగా యూపీఏ ప్రభుత్వంపై పెద్దెత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా అవి నిరూపితం కాలేదు.
  • ట్రిపుల్‌ తలాఖ్‌ : అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్, ఫోన్, లే ఖల ద్వారా  మూడుసార్లు తలాఖ్‌ అంటూ ఇచ్చే విడాకులు (తలాఖ్‌–ఏ బిద్దత్‌–ఇన్‌స్టంట్‌ తలాఖ్‌) చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2017 ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని కేంద్రం పార్లమెంట్‌లో  ప్రవేశపెట్టింది. 

వైఫల్యాలు :

  • పెద్దనోట్ల రద్దు : నల్లధనం అదుపు, నకిలీనోట్ల  నియంత్రణకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే  ఆశించిన మేర ఫలితాలు మాత్రం పెద్దగా రాలేదు. లెక్కలోకి రాని సంపద దేశ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఇతర రూపాల్లో రాకుండా అడ్డుకోలేకపోయారు. కొత్తగా వచ్చిన కరెన్సీ నోట్లకు కూడా నకిలీల జాడ్యం పట్టిపీడిస్తోంది. నకిలీ కరెన్సీ ముద్రణకు కొత్త ఎత్తులు వేస్తున్నారు.
  • మేకిన్‌ ఇండియా : మేకిన్‌ ఇండియా పేరిట స్వదేశంలో తయారయ్యే వస్తువులకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ ఉత్పత్తులను స్థానికంగానే తయారుచేయడంతో పాటు కొత్త నైపుణ్యాల సృష్టికి ఉపయోగపడుతుందని భావించిన ఈ కార్యక్రమం పెద్దగా విజయవంతం కాలేదు.గత జనవరి వరకు కేవలం 74 స్టార్టప్‌అప్‌ కంపెనీలు మాత్రమే పన్ను ప్రయోజనాలు పొందాయి. 
  • వసూలు కాని రుణాలు : ప్రభుత్వాన్ని 9 లక్షల కోట్లకు  (ట్రిలియన్ల) పైగా వసూలు కాని రుణాలు పట్టి పీడిస్తున్నాయి. గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా ఈ సమస్య వచ్చినా దీని ప్రభావం మోదీ సర్కార్‌పైనా పడింది. ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకులను కాపాడేందుకు 2 లక్షల కోట్లకు పైగా ఉద్ధీపన ప్రణాళిక తీసుకొచ్చింది. అయితే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  రూ.13 వేల కోట్లకు పైగా కుంభకోణంలో మునగడం, ఇతర బ్యాంకుల్లో సైతం అడపాదడపా కుంభకోణాలు బయటపడడం ప్రతిబంధకంగా మారింది. 
  • వ్యవసాయం : కేంద్ర ప్రభుత్వాన్ని బాధిస్తున్న వాటిలో వ్యవసాయరంగ సమస్యలు ముఖ్యమైనవే. జీడీపీ వృద్ధిలో ఈ రంగం నుంచి అందుతున్న సహకారం అంతంత మాత్రమే. 2018 బడ్జెట్‌కు పూర్వం చేసిన ఆర్థిక సర్వే ప్రకారం... దీర్ఘకాలికంగా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయరంగ ఆదాయం 25 శాతం వరకు తగ్గిపోయే అవకాశాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రుణమాఫీ కోసం డిమాండ్‌ పెరుగుతోంది.
  • ఏటా కోటి ఉద్యోగాలు : ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసినా గత నాలుగేళ్లలో పదిలక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రమే కల్పించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో జాతీయ ఉద్యోగ, ఉపాధి విధానాన్ని ప్రకటిస్తారని భావించినా అది జరగలేడు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగరంగంపై ప్రత్యేక దృష్టి నిలిపేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top