ఇంటిని కొనుగోలు చేయడానికి వచ్చి.. హత్య చేశాడు

Former Counselor Vijaya Reddy Murder Case Solved By Police - Sakshi

మాజీ కౌన్సిలర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్‌ విజయారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పక్క వ్యూహంతోనే ఆమెను దుండగులు హత్య చేశారని, ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. విజయారెడ్డిని కోలా వెంకట  హేమంత్‌కుమార్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చగా.. నిందితుడికి రాధిక అనే మహిళ సహకరించిందని తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం అసలు ఏం జరిగిందంటే..

అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌ను రూ. కోటి 50 లక్షలకు విజయారెడ్డి అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న హేమంత్, రాధిక గత శనివారం ఉదయం ఆమె దగ్గరికి వచ్చి.. 3 గంటలపాటు మంతనాలు జరిపారు. రెండోసారి అడ్వాన్స్ ఇస్తామని చెప్పి గత సోమవారం (ఫిబ్రవరి 25న) హేమంత్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో విజయారెడ్డి భర్త విష్ణునారాయణరెడ్డి ఇంట్లో లేకపోవడంతో దుండగుడి వ్యూహం ఫలించింది. దీంతో విజయారెడ్డిపై బలత్కారం చేసిన హేమంత్‌ అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అదే ఇంట్లో స్నానం చేసి ఆమె భర్త దుస్తులను ధరించి బయటకు వెళ్లిపోయాడు.

హత్య చేసిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లిన నిందితుడు.. వాటిని జువెల్లరీ షాప్‌లో విక్రయించాడు. విజయారెడ్డి కారును, ఫోన్‌ను కూడా దుండగుడు ఎత్తుకెళ్లాడు. అతను తీసుకెళ్లిన ఫోన్‌నే నిందితుడిని పట్టించిందని, ఈ కేసులో  హేమంత్‌ ఏ-1 నిందితుడు కాగా.. రాధికను ఎ-2గా నిర్ధారించామని పోలీసులు తెలిపారు. అలకనందా రియల్ ఎస్టేట్ కంపెనీలో నిందితులిద్దరు సహోద్యోగులని, వారి మధ్య అక్రమసంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి..  డబ్బుకోసం వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు.

చదవండి: కిరాతకులెవరో..?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top