ఎంపీటీసిల లెక్క తేలింది..!

Final Allocation Of MPTC,ZPTC Seats In Yadadri Bhongir District - Sakshi

జిల్లాలో ఎంపీటీసీలు 177, జెడ్పీటీసీ స్థానాలు 17 

యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిసిన గుండాల

 గతంతో పోలిస్తే తగ్గిన ఎంపీటీసీ స్థానాలు

 వీటి ప్రాతిపదికనే ఎన్నికలు.. సిద్ధమవుతున్న అధికారులు 

సాక్షి,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) లెక్క తేలింది. సవరించిన జాబితా ప్రకారం ఎంపీటీసీల సంఖ్య 177గా  నిర్ధారించారు. జిల్లాలో కలిసిన గుండాలతో కలుపుకుని 17 మండలాల్లో జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీల స్థానాలను రూపొందించారు. తుది జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండనుంచి యాదాద్రి భువనగిరి జిల్లాను 16 మండలాలతో ఏర్పాటు చేశారు. అయితే పాత మండలాలు 14 మాత్రమే ఉండగా ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతూ ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. దీంతోపాటు జిల్లాలో మోటకొండూరు, అడ్డగూడురు రెండు నూతన మండలాలు ఏర్పాటు చేశారు.

మూడు మండలాలు అదనంగా చేరడంతో జిల్లాలో ప్రస్తుతం మండలా సంఖ్య 17కు చేరింది. ప్రతి  జిల్లాకు ఒక జిల్లా పరిషత్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 17 మండలాలతో కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, రెవెన్యూ మండలాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఫిబ్రవరి 16న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఖరారు చేశారు.  2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించారు. 3,500 జనాభాకు ఒక మండల  ప్రాదేశిక నియోజకవర్గం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తక్కువగా ఉన్నప్పటికీ ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ముందుగా జారీ చేసిన  ముసాయిదా పై పలు  అభ్యంతరాలు వచ్చాయి. ఎంపీటీసీల్లో విలీనమైన  గ్రామాల మధ్యన దూరం తగ్గించాలని, ఓటర్ల సంఖ్యను 3,500 నుంచి 2000 కు తగ్గించాలంటూ సుమారు 20 అభ్యంతరాలు వచ్చాయి.  

177 ఎంపీటీసీలు
నూతన ముసాయిదా ప్రకారం జిల్లాలోని 17 మండలాల్లో  177 ఎంపీటీసీ స్థానాలను ఖరా రయ్యాయి. గతంలో జిల్లాలో 207 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 177కు తగ్గిపోయాయి. మేజర్‌ గ్రామపంచాయతీలైన ఆలే రు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీలుగా మారాయి. భువనగిరి మున్సిపాలిటీలో రాయిగిరి, బొమ్మాయపల్లి, పగిడిపల్లి గ్రామాలు ఇలా మొత్తం మున్సిపాలటీల్లో 17  పంచాయతీలు విలీనం అయ్యాయి. గతంలో 2,500 మందికి ఒక ఎంపీటీసీ స్థానం ఉండగా ప్రస్తుతం 3,500కు పెంచారు. కాగా  జిల్లాలో వలిగొండ మండలంలో17 అత్యధికంగా ఎంపిటీసీలు ఉండగా,మోత్కూరులో అతి తక్కువగా 4 ఎంపిటీసీలు ఉన్నాయి. ఆలేరు అడ్డగూడురు, మోటకొండూరులో ఏడేసీ చొప్పున ఎంపీటీసీలు ఉండగా, ఆత్మకూర్‌(ఎం) లోఎనిమిది ఎంపిటీసీ స్థానాలుఉన్నాయి. 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
ఎంపీటీసీ,జెడ్పీటీసీల సంఖ్య ఖరారు కావడంతో ఇక ఎన్నికల నిర్వహణకు అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది.రాష్ట్ర ఎన్నికల సం ఘం ఎప్పుడు ఆదేశించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి పంచాయతీరాజ్‌ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటరు జాబితాలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. అలాగే ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేస్తోంది.

మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు
ఆలేరు 7, భువనగిరి 13,  బీబీనగర్‌ 14 , బొ మ్మలరామారం 11, చౌటుప్పల్‌ 12, మోట కొండూర్‌ 7, మోత్కూర్‌ 4,  నారాయణపురం13, రాజాపేట 11, వలిగొండ 17, యాద గిరిగుట్ట 9, ఆత్మకూర్‌ 8, భూదాన్‌పోచంపల్లి 10, అడ్డగూడూరు 7, రామన్నపేట 15, తుర్కపల్లి 10, గుండాల 9 ఉన్నాయి.

రైతులందరికీ పాస్‌ పుస్తకాలు ఇవ్వాలి
భువనగిరి(వలిగొండ) : జిల్లాలో చాలా మం దికి కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందలేదని వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. వలిగొండలో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో చాలా మంది రైతులకు పాస్‌ పుస్తకాలు అందజేదన్నారు. దీంతో వారికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.  రానివారందరికీ వెంటనే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో  వేముల మహేందర్, మా టూరి బాలరాజు, చిర శ్రీశైలంరెడ్డి, మద్దెల రాజయ్య, సిర్పంగి స్వామి, ముగిలి పాక గోపాల్, కృష్ణ, అంజనేయులు, సత్తిరెడ్డి, కిష్టయ్య, రాంచందర్‌ పాల్గొన్నారు.

3న భాషా పండితుల సమావేశం
భువనగిరిటౌన్‌ : హైదరాబాద్‌లోని కొత్తపేటలో గల మహాలక్ష్మి ఫంక్షన్‌ హాలులో ఈనెల 3వ తేదీన భాషా పండితుల సమావేశం నిర్వహించనున్నట్లు  రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జీడిపల్లి సైదులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  సమావేశానికి తెలుగు, హిందీ ఉర్దూ పండిట్‌లతో పాటు పీఈటీలందరూ హాజరుకావాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top