హిందీపై కేంద్రం వెనక్కి

education policy panel drops Hindi as must language - Sakshi

హిందీ తప్పనిసరి నిబంధన తొలగింపు

దక్షిణాది వ్యతిరేకతతో కేంద్రం వెనకడుగు

సవరించిన విద్యా ముసాయిదా విడుదల

న్యూఢిల్లీ: హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలన్న నిబంధనపై కేంద్రం వెనక్కి తగ్గింది. శనివారం విడుదలయిన జాతీయ విద్యా విధానం ముసాయిదాలో హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని ప్రతిపాదించారు.దీనిపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని డీఎంకే వంటి పార్టీలు హెచ్చరించాయి. దాంతో కేంద్రం ముసాయిదాలోంచి ఈ నిబంధనను తొలగించింది.

సవరించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను సోమవారం విడుదల చేసింది.‘ తాము నేర్చుకుంటున్న మూడు భాషల్లో  ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్ధులు 6, 7 గ్రేడుల్లో (తరగతులు) ఆ పని చేయవచ్చు. మాధ్యమిక పాఠశాల బోర్డు పరీక్షల్లో  మూడు భాషల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలిగిన విద్యార్ధులు ఆరు లేదా ఏడు తరగతుల్లో భాషను మార్చుకోవచ్చు.’అని సవరించిన ముసాయిదాలో పేర్కొన్నారు. భాషా నైపుణ్యంపై బోర్డు నిర్వహించే పరీక్షల్లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది.

హిందీయేతర ప్రాంతాల్లో హిందీని తప్పనిసరి భాషగా బోధించాలని ఇంతకు ముందు ముసాయిదాలో పేర్కొన్నారు. దీనిని తమిళనాడులోని డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఐదు దశాబ్దాలుగా ద్విభాషా సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పుడు త్రిభాషా సిద్ధాంతం పేరుతో తమపై బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే సహించబోమని డీఎంకే నేత స్టాలిన్‌ హెచ్చరించారు. బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే కూడా ఈ ప్రతిపాదనను తొలగించాలని డిమాండు చేసింది.

ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది విధానం రూపొందిస్తామని  కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పినా వ్యతిరేకత ఆగలేదు. దాంతో ఆ ప్రతిపాదనను తొలగించి కొత్త ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. హిందీ నిబంధనను తొలగించడం పట్ల డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. తమ పార్టీ అధినేత కరుణానిధి సజీవంగానే ఉన్నారనడానికి  కేంద్రం సవరణే నిదర్శనమన్నారు. కరుణానిధి 95వ జయంతి సందర్భంగా స్టాలిన్‌ పార్టీ జిల్లా కార్యదర్శులు,ఎంపీలు, ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. త్రిభాషా సిద్ధాంతం ప్రతిపాదనను తిరస్కరిస్తూ సమావేశం తీర్మానం ఆమోదించింది. జాతీయ విద్యా విధానం ముసాయిదా నుంచి హిందీ తప్పనిసరి నిబంధనను తొలగించడం పట్ల కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థి ఫలానా భాష వల్ల తనకు లాభముందని అనుకుంటే ఆ భాష నేర్చుకోవచ్చని అంతేకాని వారిపై బలవంతంగా ఏ భాషనూ రుద్దరాదని హైదరాబాద్‌లో అన్నారు. గతంలో త్రిభాషా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు, దానికెదురైన వ్యతిరేకతలను ఆయన గుర్తు చేశారు. దక్షిణాదిన హిందీ భాషను ప్రచారం చేస్తున్న దక్షిణ హిందీ ప్రచార సభను మరింత పటిష్టం చేయాలని ఆయన సూచించారు. బలవంతంపు హిందీ భాష ప్రతిపాదనను తొలగించడం పట్ల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  సంతోషం వ్యక్తం చేశారు.‘ త్రిభాషా సిద్ధాంతం అవసరం లేదు. మాకు కన్నడ, ఇంగ్లీషు ఉన్నాయి. అవి చాలు. కన్నడకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’అని మైసూరులో అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top