
సాక్షి, చెన్నై : రెండాకుల గుర్తును దూరం చేసుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్‌కు మరో భారీ షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలో శశికళ-దినకరన్ వర్గం నుంచి ఐదుగురు ఎంపీలు జంప్ అయిపోయారు. దుండిగల్ ఎంపీ ఎం ఉదయ్ కుమార్, వెల్లూర్ ఎంపీ సెంగుట్టువన్.. మంగళవారం ముఖ్యమంత్రి ఎడిప్పాడి పళనిస్వామిని కలిసి మద్దతు ప్రకటించారు.
గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతూ పళని-పన్నీర్ వెంటే తాము ఉన్నామని ప్రకటించారు. ఇక ముగ్గురు రాజ్యసభ సభ్యులు నవనీతక్రిష్ణన్, విజిల సత్యానంద్, ఎన్. గోకుల క్రిష్ణన్ (పుదుచ్చేరి) నిన్న పళనిసామి, పన్నీర్ సెల్వంతో నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీ నుంచి తాము రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయ్యామని.. అధికారిక పార్టీగా గుర్తింపు పొందిన పళని వర్గానికే తాము ఓటేస్తామని వారు ప్రకటించారు.
మరికొందరు ఎమ్మెల్యేలు కూడా చేజారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, ఉదయ్ కుమార్ గతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నమ్మ(శశికళ) వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గుర్తింపు దక్కిన నేపథ్యంలో అధికార పక్షం.. దినకరన్ వర్గాన్ని ఖాళీ చేయించే పనిలో పండింది. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో దినకరన్‌కు ఈ జంపింగ్‌లు పెద్ద తలనొప్పిగా మారాయి.