రాగా తంత్రమా ? నమో మంత్రమా ?

 Difference Between the Two Main Parties is Only  0 Point 5 Percent - Sakshi

రాజస్తాన్‌లో మళ్లీ నరేంద్రమోదీ (నమో) మంత్రమే జపిస్తారా?

స్థానిక సమస్యలనే అస్త్రంగా ఎంచుకున్న రాహుల్‌గాంధీ (రాగా) తంత్రం ఫలిస్తుందా?

ఇప్పటికే మొత్తం 25 స్థానాల్లో 13 సీట్లకు ముగిసిన పోలింగ్‌

రాజస్తాన్‌లో ప్రధాని మోదీ గాలి వీస్తోందా ? 2014 ఎన్నికల మాదిరిగా ప్రభంజనం సృష్టించకపోయినా భారీగానే సీట్లు కొల్లగొడతారా ? గత అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధరా రాజెపై వ్యతిరేకతతో రాణిగారి కోటను కూలగొట్టిన ఓటర్లు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలనేసరికి మళ్లీ నమో మంత్రమే జపిస్తారా ?

పాక్‌కు సరిహద్దు రాష్ట్రంలో దేశభక్తే ఉప్పొంగుతుందా ? స్థానిక సమస్యలనే ఎన్నికల అస్త్రంగా మలచుకున్న కాంగ్రెస్‌ తంత్రం నెగ్గుతుందా ? మొత్తం 25 స్థానాలకు గాను 13 సీట్లలో నాలుగోదశలో పోలింగ్‌ జరిగింది. మిగిలిన పన్నెండు సీట్లలో మే 6న పోలింగ్‌ జరగబోతోంది. ఈ దశలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి ? రాజస్తాన్‌ ప్రజల మొగ్గు ఎటు ? 

ఓట్లు, సీట్లు   లెక్కలు ఏం చెబుతున్నాయ్‌ ? 
2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో బీజేపీ 25కి 25 సీట్లు క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఓట్లు కూడా ఇంచుమించుగా 56 శాతం వచ్చాయి. కానీ అయిదేళ్లలో పరిస్థితుల్లో భారీగా మార్పులు వచ్చాయి. ప్రధానంగా వసుంధరా రాజెపై వ్యతిరేకత, కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి భారీగా ఓట్లను చీల్చడం, కాంగ్రెస్‌ పార్టీ రుణమాఫీ హామీతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 38.8శాతం మాత్రమే ఓట్లతో 73 స్థానాలను దక్కించుకుంది. అలాగని కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాజేపై నెలకొన్న వ్యతిరేకతకి భారీగా సీట్లు, ఓట్లు కొల్లగొట్టాలి. కానీ 39.3 శాతం ఓట్లతో 100 స్థానాల్లో మాత్రమే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లలో తేడా కేవలం 0.5శాతం మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఓట్లను భారీగా చీల్చాయి. కొత్త పార్టీలే 9 శాతం ఓటు షేర్‌తో 12 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి గుడ్‌బై కొట్టేసి కొత్త పార్టీ పెట్టిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్పీ) హనుమాన్‌ బేనీవాల్‌ 2.4శాతం ఓట్లతో మూడు అసెంబ్లీ స్థానాలను సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్‌సభ ఎన్నికలు వేరు అన్న చైతన్యం ఈ మధ్య ఓటర్లలో బాగా పెరుగుతోంది. అదే ఈ సారి బీజేపీకి కలిసి వస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

జాతీయత వర్సస్‌ స్థానికత
పాకిస్థాన్‌కు సరిహద్దు రాష్ట్రం కావడంతో రాజస్తాన్‌లో బీజేపీ ప్రధానంగా సర్జికల్‌ స్ట్రయిక్స్, దేశభక్తినే ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. జై జవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్‌ అన్న నినాదంతో ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి యువకులు ఎక్కువగా సైన్యంలో చేరుతూ ఉండడంతో పుల్వామా దాడులు, అభినందన్‌ని వెనక్కి తీసుకురావడం వంటి అంశాలతో సెంటిమెంట్‌ రగిలించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌ ఇచ్చిన రుణమాఫీ అమలు సరిగా జరగకపోవడం కూడా బీజేపీకి కలిసివస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. సీఎం పదవికి పోటీ ఉండడంతో కలిసికట్టుగా పనిచెయ్యలేదు. కానీ ఈ సారి ఉమ్మడిగా వ్యూహాలు రచించారు. కాంగ్రెస్‌ పార్టీ కనీస ఆదాయ పథకం (న్యాయ్‌) సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమైనప్పటికీ, గ్రామీణ సంక్షోభం, రైతు సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

అల్వార్, అజ్మీర్‌ పరిస్థితులు మారుతున్నాయా ? 
రాజస్తాన్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి అందరి దృష్టి అల్వార్, అజ్మీర్‌ నియోజకవర్గాలపైనే ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీ ఆ తర్వాత తన హవాను నిలబెట్టుకోలేక 2018 జనవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను కోల్పోయింది. ఎవరికీ అందుబాటులో ఉండకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న నాటి బీజేపీ సీఎం వసుంధర రాజె వ్యవహారశైలిపై నెలకొన్న అసంతృప్తి సెగలు ఉప ఎన్నికల్లోనే తగిలాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో అల్వార్, అజ్మీర్‌ల నుంచి బీజేపీ తరఫున నెగ్గిన చాంద్‌నాథ్, సన్వర్‌లాల్‌ జాట్‌ మృతి చెందడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులైన రఘుశర్మ అజ్మీర్‌ నుంచి 84 వేల ఓట్ల తేడాతో, కరణ్‌ సింగ్‌ యాదవ్‌ అల్వార్‌ నుంచి ఇంచుమించుగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి ఈ స్థానాల్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా పనిచేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

అభ్యర్థుల్ని మార్చేసిన కాంగ్రెస్‌
అల్వార్, అజ్మీర్‌ ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థుల్ని మార్చేసింది. అజ్మీర్‌లో రఘుశర్మని తప్పించిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త ముఖమైన రిజు ఝున్‌ఝున్‌వాలాకు టికెట్‌ ఇచ్చింది. ఆయన స్థానికుడు కాకపోవడంతో కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 2014 ఎన్నికల్లో సన్వర్‌లాల్‌ చేతిలో ఓటమిపాలైన సచిన్‌పైలట్‌ మద్దతు కలిగిన ఝన్‌ఝన్‌వాలా పైలట్‌కున్న పాపులారిటీనే నమ్ముకున్నారు. ఇక బీజేపీ తరపున స్థానిక వ్యాపారవేత్త, కశింగఢ్‌ ఎమ్మెల్యే భగీరథ్‌ చౌ«ధరీ పోటీ చేస్తున్నారు. లోకల్‌ అభ్యర్థి కావడం ఆయనకు కలిసివస్తోంది. ఇక అల్వార్‌ మూకదాడులతో దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ప్రాంతం. హరియాణాకు చెందిన పాలవ్యాపారి పెహ్లూఖాన్‌ను హిందూ మతోన్మాదులు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లే కీలకం.

ఆ తర్వాత మియో ముస్లింలు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. గోసంరక్షణ పేరిట జరిగిన మూక దాడుల ప్రభావం ఉప ఎన్నికల్లో బీజేపీపై పడింది. అయినప్పటికీ ఈ సారి కూడా మతపరమైన విభజననే ఆ పార్టీ నమ్ముకుంది. గత ఎన్నికల్లో నెగ్గి మృతిచెందిన చాంద్‌నాథ్‌ శిష్యుడు, బాబా బాలక్‌నాథ్‌ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరఫున భన్వర్‌ జితేంద్ర సింగ్‌ ఆయనకి గట్టిపోటీయే ఇస్తున్నారు. బీఎస్పీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌కు టికెట్‌ ఇవ్వడంతో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోయి బీజేపీకి లాభం చేకూరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దౌసా లోక్‌సభ ఎంపీ హరీశ్‌ మీనా బీజేపీకి గుడ్‌ బై కొట్టేసి కాంగ్రెస్‌ శిబిరానికి చేరుకోవడం కమలనాథులకి ఎదురు దెబ్బే. 

పింక్‌ సిటీ జైపూర్‌లో ఒక మహిళా అభ్యర్థికి 48 ఏళ్ల తర్వాత పోటీ చేసే అవకాశం రావడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌చరణ్‌ బొహ్రా ఏకంగా 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ నేత మహేశ్‌ జోషిని మట్టికరిపించారు. క్లీన్‌ ఇమేజ్‌ కలిగిన బొహ్రాకు కార్యకర్తల్లో కూడా మంచి ఆదరణ ఉంది. . పార్లమెంటు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. 110 చర్చల్లో పాల్గొన్ని 312 ప్రశ్నలు వేశారు.అయితే నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలూ ఉన్నాయి. అలాంటి గట్టి అభ్యర్థిని ఢీకొనడానికి ఏరికోరి ఒక మహిళకు సీటు ఇవ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ నగర మాజీ మేయర్‌ జ్యోతి ఖండేల్‌వాల్‌ను బరిలో దింపింది. దీంతో ఇక్కడ హోరాహోరి పోరు నెలకొంది.

చివరిసారిగా1971లోజైపూర్‌ మాజీ మహారాణి గాయత్రిదేవి స్వతంత్రపార్టీ తరఫున ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు, రాజపుత్రుల ఓట్లే ఇక్కడ కీలకం.రాజస్థాన్‌లోని జైపూర్‌ (రూరల్‌) నియోజకవర్గంలో ఇద్దరు క్రీడాకారుల మధ్య పోరాటానికి తెరలేచింది. బీజేపీ ఎంపీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ గురితప్పని షూటర్‌. 2014లో మోదీ హవాతో రాథోడ్‌ జయపూర్‌ రూరల్‌ నుంచి సులభంగా నెగ్గారు. ఆ వెంటనే మంత్రి పదవి వరించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ పూనియా డిస్కస్‌ త్రోలో అంతర్జాతీయంగా భారత కీర్తిపతాకను రెపపలాడించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయిదేళ్లలో సీన్‌ మారిపోయింది. వసుంధర రాజెకి వ్యతిరేక పవవాలు వీయడంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పూనియా సదూల్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిగా రాథోడ్‌ మంచిపేరే సంపాదించుకున్నారు.

ఆయనపై పోటీకి నిలబడడమే ఒక సాహసం. అలాంటి సాహసాన్ని ఒక క్రీడాకారిణి చేయడంతో కృష్ణ పూనియాపై కూడా అంచనాలు పెరిగాయి. బీజేపీ, ఆరెస్సెస్‌ అండదండలు, మోదీ ఇమేజ్‌ రాథోడ్‌కు కలిసి వస్తే, జాట్‌ సామాజిక వర్గానికి చెందిన పూనియాకు కులసమీకరణలు అనుకూలం. రాథోడ్‌ని ఎదుర్కోవడానికి చేతికి గ్లౌజులు ధరించి సిద్ధంగా ఉన్నానంటూ పంచ్‌ డైలాగ్‌లతో పూనియా ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు. ‘‘నేను రైతు బిడ్డని. నాకు గ్రామీణుల పడే బాధలేంటో తెలుసు. క్రీడల్లో కూడా నేను గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆడే డిస్కస్‌ త్రోనే ఎంచుకున్నా. ఏసీ హాళ్లలో కూర్చొని ఆటలాడే గేమ్స్‌ నాకు తెలీవు‘‘అని రాథోడ్‌ పైకి మాటల తూటాలు పేల్చారు.. మరోవైపు గత అయిదేళ్లలో నియోజకవర్గానికి తాను ఎంత చేస్తున్నారో చెబుతున్న రాథోఢ్‌ యువతరం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. 

బికనీర్‌  అన్నదమ్ముల సవాల్‌

బికనీర్‌ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్‌డ్‌) బీజేపీకికంచుకోట. గత 15 ఏళ్లుగా ఈ సీటు బీజేపీకే దక్కుతోంది. 2004లో బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర ప్రాతినిధ్యం వహించిన స్థానం. ఈ సారి ఒక మాజీ ఐఎఎస్‌ మాజీ ఐపీఎస్‌ మధ్య ఉత్కంఠభరిత పోరాటానికి తెరలేచింది. వీళ్లిద్దరూ బంధువులు కూడా కావడం విశేషం. గత రెండు దఫాలుగా బీజేపీకిచెందిన అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఐఎఎస్‌ అధికారి, కేంద్ర మంత్రి అయిన అర్జున్‌ రామ్‌కు నియోజకవర్గంలో మంచిపేరు ఉంది. చేనేత కుటుంబానికి చెందిన ఆయన కష్టపడిచదువుకొని ఐఎఎస్‌ అయ్యారు. చురు జిల్లాకు కలెక్టర్‌గా పని చేసిన అర్జున్‌రామ్‌ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు.

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా భూ వివాదం కేసు ఆయన పర్యవేక్షణలోనే సాగింది. నీటివనరులు, గంగాప్రక్షాళన శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్‌రామ్‌ ఇప్పటికీ పార్లమెంటుకి సైకిల్‌పై వచ్చే అతి కొద్ది మంది ఎంపీల్లో ఒకరు. ఈయనపై పోటీకి కాంగ్రెస్‌ పార్టీ ఆయన పిన్ని కుమారుడు ఐపీఎస్‌అధికారి అయిన మదన్‌గోపాల్‌ను రంగంలోకి దింపింది. ‘‘అర్జున్‌రామ్‌ మా పెద్దమ్మ కొడుకు. నా కన్నా పెద్దవాడు. కానీ మా ఇద్దరి భావజాలంలో చాలా తేడాలున్నాయి. నేనుఎన్నికల్లో పోటీపడడం . అయినా దీనిని సవాల్‌గా తీసుకున్నా‘అని మదన్‌ అంటున్నారు. జాట్లు ఆధిక్యం కలిగినబికనీర్‌లో ముస్లింలు, రాజపుత్రులు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు.

మే6న పోలింగ్‌ జరిగే స్థానాలు(మొత్తం – 12)
►గంగానగర్, బికనీర్, చురు, ఝున్‌ఝునూ, సీకర్,
►జైపూర్‌ (రూరల్‌), జైపూర్, అల్వార్, భరత్‌పూర్,
►కరౌలీ–ధోల్‌పూర్, దౌసా, నాగౌర్‌ 

►‘‘ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేశాను. ఎందుకంటే ఆ ఓటు ప్రధానిని ఎన్నుకోవడానికి కాదు. కేవలం వసుంధరా రాజెను ఇంటికి పంపించడానికే. మా లక్ష్యం నెరవేరింది. మోదీపై మాకు ఎప్పుడూ వ్యతిరేకత లేదు’’
– జితేంద్ర చౌదరి, ధర్మపుర గ్రామస్తుడు

►‘‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో జరగకపోతే పదకొండో రోజునే సీఎంను మారుస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదే పదే చెప్పారు. మా రుణాలు మాఫీ కూడా కాలేదు. ఆయన సీఎంనూ మార్చలేదు. ఇక కాంగ్రెస్‌కి మేమెందుకు ఓటు వేయాలి‘‘
– బుద్ధరామ్‌ జాట్, అల్వార్‌ రైతు 

►‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని మోదీ చెప్పారు. గుజరాత్‌ మోడల్‌ అంటూ ఊదరగొట్టారు. కానీ గత అయిదేళ్లలో మాకు ఒక్క రోజు కూడా పని దొరకలేదు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి’’
– రాహుల్‌ మీనా, గమ్రీ గ్రామస్తుడు

►‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను మార్చేసి, ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తారు. సుప్రీం తీర్పుల్ని కూడా ఆయన లెక్కచేసే పరిస్థితి ఉండదు’’
కన్నయ్యలాల్‌ భుజ్, ఆదివాసీ యువకుడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top