...అయిననూ అస్పష్టతే!

Devendra Fadnavis and Shiv Sena in Delhi to finalise power - Sakshi

ఢిల్లీ, ముంబైలో అత్యున్నత భేటీలు

సోనియాతో పవార్, అమిత్‌ షాతో ఫడ్నవీస్, గవర్నర్‌తో రౌత్‌ భేటీ

అయినా ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజంతా ఎవరికి వారు సమావేశాలు జరిపినా ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టతలేదు. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.   

గవర్నర్‌ని కలిసిన శివసైనికులు  
శివసేన పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్, ఇతర నేతలతో కలిసి సోమవారం మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ కోష్యారీని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే తాము గవర్నర్‌ని కలిశామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు తాము కారణం కాదని గవర్నర్‌కు చెప్పామని సంజయ్‌ వెల్లడించారు.  

అమిత్‌ షాతో ఫడ్నవీస్‌ మంతనాలు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి తొందర లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిష్టంభనపై చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం లేదు. నేను కచ్చితంగా చెబుతున్నా. ప్రభుత్వమైతే ఏర్పాటవుతుంది’అని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను ఫడ్నవీస్‌ కలుసుకున్నారు.

రౌత్‌ ఒక భేతాళుడు: మరాఠీ పత్రిక హేళన
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభానికి శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కారణమనే ఉద్దేశంతో ఆయనను ఒక మరాఠీ పత్రిక భేతాళుడిగా చిత్రీకరించింది. ఆరెస్సెస్‌కు మద్దతుగా నిలిచే తరుణ్‌ భారత్‌లో రాసిన ఒక వ్యాసంలో విక్రమార్కుడి భుజంపై వేళ్లాడే భేతాళుడు సంజయ్‌ అని, బీజేపీ–శివసేన అధికారంలోకి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని తిట్టిపోసింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు ముందన్న నేపథ్యంలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగడం అత్యంత ముఖ్యమని పేర్కొంది.  

గడ్కరీ మధ్యవర్తిత్వం ?
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని రంగంలోకి దింపితే బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారని శివసేన పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేకు సలహాదారుడైన కిషోర్‌ తివారీ సోమవారం ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు ఒక లేఖ రాశారు. గడ్కరీని శివసేనతోచర్చలకు పంపాలని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top