ఇదా ‘విచక్షణ’? 

Criticism Over Postponing Local Elections - Sakshi

‘కరోనా’ కారణం చూపుతూ ‘స్థానిక’ ఎన్నికల వాయిదా  

పరిస్థితి అదుపులో ఉన్నా కుంటి సాకులు 

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై సర్వత్రా విమర్శలు 

కమిషనర్‌ నిర్ణయంతో 14వ ఆర్థిక సంఘ నిధులు కోల్పోయినట్లే.. 

ఓటమి భయంతోనే టీడీపీ కుట్ర పన్నిందని ఆగ్రహావేశాలు 

మనపై కరోనా ప్రభావం లేదు.. రాష్ట్రంలో ఎక్కడో చెదురుమదురు సంఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి.. అయినా ‘విచక్షణాధికారం’తో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. రాజ్యాంగానికి బద్ధుడై ఉండాల్సిన ఉన్నత స్థాయి వ్యక్తి ఓ రాజకీయ పార్టీ కుటిల యత్నాలకు ఊతమివ్వడం ఎంత వరకు సబబని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు.. ఇది ఓటమి భయంతో టీడీపీ పన్నిన పన్నాగమని, 14వ ఆర్థిక సంఘ నిధులు కోల్పోతే అభివృద్ధి సాధించాలన్న ప్రభుత్వ యత్నాలు ఎలా ముందుకు సాగుతాయని ప్రజలు నిలదీస్తున్నారు.

అరసవల్లి, శ్రీకాకుళం: కరోనా వైరస్‌ను బూచిగా చూపుతూ... స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈనెలాఖరు కల్లా పరిషత్, పురపాలక, గ్రామ పంచాయతీల పాలకుల ఎన్నికలు పూర్తి కానున్నాయి. అలా జరిగితే రూ.5 వేల కోట్ల నిధులు పంచాయతీలకు చేరేవి. తాజాగా ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సంఘ నిధులకు బ్రేక్‌ పడింది. ఈ నిర్ణయం వెనుక మాజీ ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రాంగం నడిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో 2200కు పైగా ఎంపీటీసీలు, 125 వరకు జెడ్పీటీసీలు ఏకగ్రీవాలై.. వైఎస్సార్‌సీపీ పరం కావడం తట్టుకోలేక తనదైన తప్పుడు మార్గాల తలుపులు తెరిచినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. 

ఏకగ్రీవాలను తట్టుకోలేకనే....
ఈనెల 7న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ముందుగా పరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్లు, స్రూ్కట్నీ, ఉపసంహరణలు పూర్తయ్యయి. తుది జాబితాలను కూడా ఖరారు చేశారు. ఈనెల 21న పోలింగ్‌ జరుగనుంది. అలాగే జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండ పురపాలక సంఘాల్లో కూడా నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. అయితే ఇందులో 66 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, జెడ్పీటీసీల్లో కూడా శతశాతం విజయానికి అవకాశమున్న పరిస్థితులను విపక్ష పార్టీ ఏమాత్రం తట్టుకోలేకపోయింది. దీంతో అధికార పార్టీ అల్లర్లు, దౌర్జన్యాలు చేస్తోందంటూ అసత్య ప్రచారాలకు దిగింది. దీంతో ఎన్నికల కమిషనర్‌ను కలిసి రాష్ట్రంలో దారుణాలు జరిగిపోతున్నాయన్న కలరింగ్‌ ఇచ్చేలా చంద్రబాబు వ్యవహరించారు. ఏకగ్రీవాలను తట్టుకోలేకే ఇలా మాయోపాయాలకు దిగారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ తదితర ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడానికి ఆంక్షలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడినా ఎన్నికల కోడ్‌ అమల్లోనే ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్‌ పడింది.

కరోనా కంటే ప్రమాదకరం చంద్రబాబు వైరస్‌ 
రాష్ట్రంపై కరోనా వైరస్‌ ప్రభావం ఎంత ఉందో తెలియదు గానీ... అంతకుమించిన ప్రమాదకర వైరస్‌గా రాష్ట్రంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. గ్రామీణాభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. ఓటమి భయం నుంచి కొన్నాళ్లు తప్పించుకోవడానికి చంద్రబాబు పన్నిన కుట్ర కారణంగా ఇప్పుడు నిధులకు అడ్డంకి ఏర్పడుతుంది. 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పగా చెప్పుకునే నాయకుడు ఇంతటి కుటిల యత్నాలకు దిగుతాడని కనీసం ఆ పార్టీ వారు కూడా ఊహించి ఉండరు.

భూస్థాపితం దిశగా.. తెలుగుదేశం 
సార్వత్రిక ఎన్నికల్లో తీవ్రమైన ప్రజావ్యతిరేకత మూటకట్టుకున్న తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతోంది. గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 స్థానాలకు, 25 ఎంపీ స్థానాల్లో మూడింటికీ పరిమితమైన టీడీపీ పరిస్థితి స్థానిక ఎన్నికల నాటికి మరింత దిగజారింది. ఇటీవల కాలంలో జిల్లాలో టీడీపీని వీడి వేలాదిమంది వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు కేవలం రెండు చోట్ల గెలిచి, ఒక ఎంపి స్థానంతో సరిపెట్టుకున్న జిల్లా టీడీపీలో ఇప్పుడు క్యాడర్‌ అంతా జారుకుంటోంది. చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు, కళావెంకటరావుల సొంత నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వైఎస్సార్‌సీపీకి దక్కడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో పార్టీ పూర్తిగా మునిగిపోతుందని తెలిసి...ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాల కోసం తన సామాజిక వర్గ అధికారులను చంద్రబాబు వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 66 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేగిడి, వంగర ఎంపీపీలు హస్తగతమయ్యాయి.

తాజా ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసేందుకు కూడా ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ స్థానాల వరకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో టీడీపీ అగ్రనాయకులుగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, కూన రవికుమార్, గౌతు శివాజీ, గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్‌ తదితర నాయకులంతా బతిమలాడుతూ కూడా అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వంగర, రేగిడి, కోట»ొమ్మాళి, సంతకవిటి, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, లావేరు, కంచిలి, కవిటి, నందిగాం తదితర మండలాల్లో టీడీపీ అభ్యర్థులు ముందుగానే చేతులెత్తేశారు.

ఈ పరాభవాన్ని ఎలా తట్టుకోవాలని యోచిస్తుండగా వారికి ఎన్నికలు వాయిదా పడడం ఆనందాన్నిచ్చింది. జిల్లాలో రాజాం, ఆమదాలవలస, శ్రీకాకుళం మునిసిపల్‌ ఎన్నికలకు ఏదో ఒక సాకు చూపించి ఆ పారీ్టకి చెందిన నాయకుల ద్వారా కోర్టును ఆశ్రయింపజేసి ఎన్నికలను వాయిదా వేయించగలిగింది. దీని వలన అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. ఇందుకు ఉదాహరణగా శ్రీకాకుళం కార్పొరేషన్, రాజాం నగర పంచాయతీలను చెప్పవచ్చు. 2010 నుంచి ఈ రెండింటికీ ఎన్నికలు లేకపోవడం వలన 14వ ఆర్థిక సంఘం నిధులను కోల్పోవాల్సి వచ్చింది. దీని వలనే ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. తెలుగుదేశం నాయకులు అభివృద్ధిని కాంక్షించకుండా తాము, తమ పార్టీ మనుగడే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుండడం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  

ఎవరిని సంప్రదించారు? 
ఎవరినీ సంప్రదించకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విచక్షణాధికారం పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరించింది. రాష్ట్రంలో మరో పక్షం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ ముగుస్తుందనగా ఇలా చేయడం తగదు. మార్చి 31లోపు స్థానిక సంస్థల ప్రక్రియ పూర్తి కాకపోతే కేంద్రం నుంచి 14 ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.5 వేల కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు అంతగా లేవని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు చెపుతున్నాయి. దాని కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం అహరి్నశలు శ్రమిస్తూ అంది. నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్‌ విచక్షణ కోల్పోయి, చంద్రబాబు అండ్‌కోకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేస్తుందనే అక్కసుతోనే ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. 
–రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌  

కుంటి సాకులు చెప్పొద్దు 
కరోనాను ఎదుర్కొనడానికి ఎన్నికల ప్రచారాన్నే ఒక సాధనంగా చేసుకోవలసింది. ఈ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేయవచ్చు.  కుంటి సాకులతో ఎన్నికలు వాయి దా వేశారని అభ్యర్థులు నిరాశ చెందవద్దు. ప్రచారం ఆపవద్దు. వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించడం ఖాయం. 
–తమ్మినేని సీతారాం,  శాసనసభాపతి   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top