ఇక బహు‘జన’ బాట!

cpm maha sabhalu - Sakshi

సీపీఎం రాష్ట్ర మహాసభల్లో నిర్ణయం

బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను క్షేత్ర స్థాయిలో విస్తరించాలి

పూర్వవైభవం దిశగా కార్యాచరణ

నేతలకు దిశానిర్దేశం చేసిన పార్టీ అగ్ర నాయకత్వం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)తో ముందుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో ఈ మేరకు అగ్రనాయకత్వం తీర్మానం చేసింది. సామాజిక న్యాయ మే ప్రధాన ఎజెండాగా బీఎల్‌ఎఫ్‌ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక, ఆర్థిక, వర్గపరంగా అణచివేతకు గురవుతున్న కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీఎల్‌ఎఫ్‌ వేదికగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం నాయకత్వం పిలుపునిచ్చింది.

వచ్చే సాధారణ ఎన్నికల నాటికి బీఎల్‌ఎఫ్‌తో క్షేత్రజల్లో చైత న్యం ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్కలిగించేందుకు పలు కార్యక్రమాల కార్యాచరణను రూపొందించింది. 28 పార్టీల కలయికతో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన బీఎల్‌ఎఫ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభ సభ సందర్భంగా పిలుపునిచ్చారు.  

పూర్వవైభవం సాధించే దిశగా..
ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత తెలంగాణలో సీపీఎం ప్రాభవం కోల్పోతూ వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు మిశ్రమ ఫలితాలనే సాధించి పెట్టాయి. స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోయారు.

కేడర్‌ కొన్ని చోట్ల బలంగానే ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకత్వం బలహీనంగా ఉండటంతో పునరుత్తేజం నింపేందుకు బీఎల్‌ఎఫ్‌ను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. పాతికేళ్లలో వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా సాధించిన జయాపజయాలను బేరీజు వేసుకున్న సీపీఎం నాయకత్వం..ఈ సారి ఏ పార్టీతో జత లేకుండానే ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మొదటి అడుగు వేసింది.  

పట్టున్న జిల్లాల్లో విజయమేనని ..
ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుతో ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోనూ ఆ పార్టీకి ఉన్న నాయకగణం, కేడర్‌ చేజారింది. బీఎల్‌ఎఫ్‌తో ఈ జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవం తేవడంతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. బీఎల్‌ఎఫ్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్న సంఘాల్లో చాలా వరకు ఈ రెండు జిల్లాలు వేదికగా పురుడు పోసుకున్నవి కావడం.. ఇది తమకు కలసి వస్తుందన్న నమ్మకంలో ఆ పార్టీ ఉంది.

పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో పాటు ప్రజా సంఘాలకు మద్దతుగా ఉన్న ప్రజా ఆకర్షణ, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలంతా ఒకే గూటికి వస్తే బీఎల్‌ఎఫ్‌ ఈ రెండు జిల్లాల్లో కీలక శక్తి కానుందని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో ఈ రెండు జిల్లాల్లో అనుకున్న స్థాయిలో బీఎల్‌ఎఫ్‌తో విజయం సాధిస్తే.. మిగతా జిల్లాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తామని నమ్ముతోంది. బీఎల్‌ఎఫ్‌లో చేరిక విషయమై ఇప్పటి వరకు సీపీఐ నిర్ణయం వెలువరించక పోవడంతో.. ఆ పార్టీకి స్వాగత ద్వారాలను తెరిచి ఉంచారు.

వామపక్ష శక్తుల్లో కీలకమైన సీపీఐ ఒక్కటి బీఎల్‌ఎఫ్‌లో కలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎక్కువ స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇస్తామని, కొన్నింట్లో విజయం సాధిస్తామని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీపీఎం రాష్ట్ర మహాసభల్లో బీఎల్‌ఎఫ్‌ అంశంపై ఆ పార్టీ అగ్రనాయకులు చర్చ చేయడం, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కితాబు ఇవ్వడంతో.. రానున్న రోజుల్లో దీని విజయాలు ఎలా ఉంటాయోనని బీఎల్‌ఎఫ్‌లోని పార్టీలు అంచనా వేస్తున్నాయి.

లౌకికవాదాన్ని కాపాడుకుందాం
సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభ పిలుపు
నల్లగొండ టౌన్‌: మతోన్మాద, సంఘ్‌ పరివార్‌ దాడులను ప్రతిఘటించాలని, లౌకిక వాదాన్ని కాపాడుకుందామని సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం సభ పలు తీర్మానాలు ఆమోదించింది. ఎంబీసీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బాలికలు, మహిళలపై లైం గిక దాడులను అరికట్టాలని కోరింది. అసంఘటిత రంగకార్మికులకు కనీస వేతనాలు పెంచాలి తదితర తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సీపీఎం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, మహాసభలు బుధవారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించనున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top