కమ్యూనిస్ట్‌లపై మోదీ వ్యాఖ్యలు సిగ్గు చేటు

CPI Leader Suravaram Sudhakar Reddy Fires On Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాదు : డిఫెన్స్‌ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి 25 వరకూ నాలుగు సంఘాలకు చెందిన దాదాపు 4 లక్షల మంది కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. డిఫెన్స్‌ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు అనుమతించడం వల్ల దేశ రక్షణకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాక మోదీ కక్షపూరితంగానే ఆలోక్‌ వర్మను ట్రాన్స్‌ఫర్‌ చేయించారని ఆరోపించారు. ఆలోక్‌ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక కేరళలో కమ్యూనిస్ట్‌లపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. జేఎన్‌యూ విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ ఫ్రంట్‌ బీజేపీ లబ్ధి కొరకే : చాడ
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయిస్తే ఒక రకంగా.. టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ఫిర్యాదు అందగానే ఆఘమేఘాల మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని విలీనం చేయడం పద్దతి కాదని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభలను ఔన్నత్యంగా నడపాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top