వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

 Congress Win The 2019 election - Sakshi

80 సీట్లు రావడం ఖాయం

కాంగ్రెస్‌ జోలికి వస్తే అంతుచూస్తాం

పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు

ప్రజా చైతన్య యాత్రలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

హాజరైన జానారెడ్డి, షబ్బీర్, రేవంత్, పొన్నం

జనసంద్రమైన పాలకుర్తి 

సాక్షి, జనగామ : ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనం వీస్తుంది.. డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి.. 80కి పైగా సీట్లను గెలుచుకోనున్నాం..’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ చేపట్టిన రెండో విడత బస్సు యాత్ర బుధవారం పాలకుర్తి నియోజకవర్గానికి చేరింది. గూడూరు నుంచి బమ్మెర మీదుగా పాలకుర్తికి చేరగా.. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ అధ్యక్షతన జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్రంలో ఎక్కడైనా సరే.. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతం చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్తితో సహా తీర్చుకుంటామన్నారు.

పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారని.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంప్రదాయాలను ఇప్పుడు అధికారులు పాటించడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో దళితులు, గిరిజనులు అవమానాల పాలయ్యారని.. అణచివేతకు గరౌతున్నారన్నారు. మాల, మాదిగలు లేకుండా రాష్ట్ర కేబినెట్‌ ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నూటికి నూరుశాతం అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర 21 నియోజకవర్గాల్లో కొనసాగిందన్నారు. 12 రోజులుగా కొనసాగుతున్న ఈ యాత్రలో పాలకుర్తి బహిరంగ సభ పెద్దదన్నారు. రానున్న రోజుల్లో జంగా రాఘవరెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమని, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి పోవడం ఖాయమని.. మీ అందరిని చూస్తే తెలిసిపోతోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సభలో మల్లు రవి, నంది ఎల్లయ్య, రవీంద్రనాయక్, పొన్నం ప్రభాకర్‌రెడ్డి, గండ్ర జ్యోతి, నాయిని రాజేందర్‌రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top