
కరీంనగర్ జిల్లా: టీఆర్‌ఎస్ నాలుగేళ్లలో అవినీతి, అక్రమాలే చేసింది తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీ నటి ఖుష్బూ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఆమె మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ వస్తే ఒక మంచి పని ఐనా జరుగుతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. తెలంగాణలో కనీసం మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని, మంత్రివర్గంలో మహిళలకు చోటులేకపోవడం దురదృష్టకరమని వ్యాక్యానించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఏనాడూ ప్రజల్లోకి రాలేదని అన్నారు. కనీసం సెక్రటేరియట్‌కు కూడా కేసీఆర్ వెళ్లిన దాఖలాలు లేవన్నారు.
మహిళల కోసం ఏదైనా చేశారా అంటే కేసీఆర్ కుమార్తె కవితకు మాత్రమే మేలు చేశారని విమర్శించారు. తెలంగాణాలో దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. మావోయిస్టు సభ్యురాలు శృతిని లైంగికంగా హింసించి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. ఆమె ఛాతీపై, కాళ్లపై చిత్రహింసలకు గురి చేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు లోపాయికారిగా కలిసిపోయాయని ఆరోపించారు.36 లక్షల మంది రైతులకు ఇంకా పాసు బుక్కులే అందలేదని తెలిపారు. గతంలో రేషన్ కార్డులపై ఇచ్చిన 9 రకాల సరుకులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ వాటిని ఇస్తామని చెప్పారు.
బతుకమ్మ చీరల్లో రూ.220 కోట్ల స్కాం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలోనే అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, డబ్బులీయందే ఇక్కడ ఏ పనీ జరగడం లేదని వ్యాఖ్యానించారు. రూ.25 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణాను రూ.2.2 లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయేలా చేశారని టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సీఎం కేసీఆర్‌కు 6 శాతం కమిషన్లు ముట్టాయని ఆరోపించారు. హస్తం గుర్తుకు ఓటేస్తే మీ సమస్యలన్నీ తీరుతాయని అన్నారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లామని తెలిపారు.