మావీ ‘అతిపెద్ద’ పార్టీలే!

Congress, RJD for Karnataka model in Goa, Manipur and Bihar - Sakshi

మమ్మల్నీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి

గోవా, మణిçపూర్, మేఘాలయలో కాంగ్రెస్, బిహార్‌లో ఆర్జేడీ డిమాండ్‌

న్యూఢిల్లీ/పణజి/పట్నా: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఆ రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని ఆయుధంగా మార్చుకోనున్నాయి. గోవా, మణిపుర్, మేఘాలయతో పాటు బిహార్‌లో అతిపెద్ద పార్టీలుగా నిల్చిన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరేందుకు సిద్ధమయ్యాయి.

గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరుతూ 16 మంది ఎమ్మెల్యేల సంతకాల లేఖను శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ మృదులా సిన్హాకు అందజేయనున్నట్లు గోవా కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 17 సీట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. గవర్నర్‌తో సమావేశంలో గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుని కర్ణాటక తరహాలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరతామన్నారు. మరోవైపు మణిపుర్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత ఇబోబీ సింగ్, మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మాలు శుక్రవారం ఆయా రాష్ట్రాల గవర్నర్లతో సమావేశం కానున్నారు. మణిçపూర్‌లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరతామని ఇబోబీ సింగ్‌ తెలిపారు.

బిహార్‌ గవర్నర్‌తో భేటీ కానున్న తేజస్వీ
కర్ణాటక ఉదంతం నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌తో శుక్రవారం భేటీ అవుతానని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో నితీశ్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసి కర్ణాటక తరహాలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top