హస్తానికి నవ సారథులు | Sakshi
Sakshi News home page

హస్తానికి నవ సారథులు

Published Fri, Feb 8 2019 10:46 AM

Congress New Greater Districts Presidents Announced - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్‌ పార్టీ నగర నూతన అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ నియమితులయ్యారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కూనశ్రీశైలంగౌడ్, రంగారెడ్డి జిల్లాకు చల్లా నర్సింహారెడ్డిని కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. ఈ ముగ్గురు నాయకులు పార్టీలోసీనియర్లు కావడంతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారే. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అంజన్‌కుమార్‌ యాదవ్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఈయన సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుంచి 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. మేడ్చల్‌ జిల్లా బాధ్యతలు తీసుకోనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌  గతంలో కుత్బుల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. అదే నియోకజవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. గురువారం  అంజన్‌కుమార్, శ్రీశైలంగౌడ్‌ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. మహానగరంలో కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ 2004 నాటికి వైభవం తీసుకువస్తామని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో సత్తా చాటుతామని తెలిపారు. పార్టీకి దూరమైన వారితో పాటు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళతామని ప్రకటించారు.  రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీకి కొత్త సారథిగా నియమితులైన చల్లా నర్సింహారెడ్డి గతంలో సరూర్‌నగర్‌ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పగ్గాలు అందుకోవడం కోసం చల్లాతో పాటు జెడ్పీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వేణుగౌడ్, దండెం రాంరెడ్డి పోటీపడ్డారు. అయితే, ఇందులో చివరి వరకు చల్లా, జంగారెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించినప్పటికీ, నర్సింహారెడ్డి వైపే మొగ్గు చూపింది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చల్లా నాయకత్వాన్ని సిఫార్సు చేశారు. ఈమేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ పీసీసీకి లేఖ రాశారు. దీంతో ఆయన సారథ్యానికి అధిష్టానం పచ్చజెండా ఊపింది. మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడకు చెందిన చల్లా నర్సింహారెడ్డి 1984లో కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎన్‌ఎస్‌యూఐలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1988 నుంచి 1991 వరకు జిల్లెలగూడ గ్రామ అధ్యక్షుడిగా, 1991 నుంచి 1994 వరకు జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, 1994 నుంచి 2002 వరకు సరూర్‌నగర్‌ మండల అధ్యక్షుడిగా, 2002–2009 మధ్య మలక్‌పేట్‌ అసెంబ్లీ బి–బ్లాక్‌ అధ్యక్షుడిగాను, అనంతరం రాష్ట్ర పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా 1988లో జిల్లెగూడ గ్రామ ఉప సర్పంచ్‌గాను, 1994లో సర్పంచ్‌గా, 2001లో సరూర్‌నగర్‌ మండల జడ్పీటీసీగా ఉన్నారు. డీసీసీ పదవిని ఆశించిన ఏనుగు జంగారెడ్డి.. తనను ఎంపిక చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా చల్లా పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించిన తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే! 

Advertisement

తప్పక చదవండి

Advertisement