స్పీకర్‌ నాపై ‘లైంగిక’ వ్యాఖ్యలు చేశారు: మహిళా ఎమ్మెల్యే

Congress MLA Accuses Speaker Of Making Sexist Remark - Sakshi

చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌ విజయధరణి రాష్ట్ర స్పీకర్‌ పీ ధన్‌పాల్‌పై షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి సభలో స్పీకర్‌ లైంగికపరమైన వ్యాఖ్యలు చేశారని, దీంతో తాను కన్నీటిపర్యంతమయ్యానని ఆమె మంగళవారం మీడియాకు తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయధరణి తన నియోజకవర్గం సమస్యలను లేవనెత్తేందుకు ప్రయత్నించారు. కన్యాకుమారి జిల్లాలో ఇటీవల ముగ్గురు విద్యుత్‌ షాక్‌తో మరణించారని, అందులో ఒకరు తన నియోజకవర్గానికి చెందిన వారని, మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆమె సభలో అభ్యర్థించారు.

స్పీకర్‌ అవకాశం ఇవ్వకపోయినా ఆమె మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారు. స్పీకర్‌కు దమ్ముంటే తనపై చర్య తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఆమెను మార్షల్స్‌ బలవంతంగా సభ బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయధరణి..  సభలో తన అభ్యర్థనను స్పీకర్‌ వినిపించుకోలేదని, అంతేకాకుండా ఆ విషయంలో మంత్రితో ‘పర్సనల్‌ డీల్‌’ (వ్యక్తిగత ఒప్పందం) చేసుకోవాలంటూ తనను ఉద్దేశించి లైంగికపరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె తెలిపారు. ‘మీరు, మంత్రి కలిసి వ్యక్తిగత ఒప్పందం చేసుకోండి. ఇందులోకి సభను లాగవద్దు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలతో తాను ఆవేదన చెంది కన్నీటిపర్యంతమయ్యాయనని ఆమె తెలిపారు.

అంతకుముందు సభలో విజయధరణి తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఆమె ఇలా అనుచితంగా వ్యవహరించడం తొలిసారి కాదని, పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సభలోని సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు తరలించారు. అనంతరం కాంగ్రెస్‌ సభాపక్ష నేత కేఆర్‌ రామస్వామి ఈ విషయం సభలో లేవనెత్తేందుకు ప్రయత్నించినా.. స్పీకర్‌ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్‌ సభ్యులు నిరసనగా వాకౌట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top