కాంగ్రెస్‌.. ఓ లాలీపాప్‌ కంపెనీ

Congress a 'Lollipop Company', Has No Real Concern for Farmers - Sakshi

కొందరు రైతులకు తాయిలాలు ఇచ్చి చేతులు దులుపుకుంది

ఘాజీపూర్‌ సభలో మోదీ

ఘాజీపూర్‌/వారణాసి: రుణమాఫీ విషయంలో దేశంలోని రైతులను కాంగ్రెస్‌ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు భిన్నంగా ఆ పార్టీ రైతులకు లాలీపాప్స్‌(చిరు తాయిలాలు) అందించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రధాని లాలీపాప్‌ కంపెనీగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో భాగంగా శనివారం ఘాజీపూర్, వారణాసిలో రూ.98 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ, కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు.

అనర్హులకే రుణమాఫీ చేశారు
‘కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఓ 800 మంది రైతుల రుణాలను మాఫీ చేసి చేతులు దులుపుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఈ లాలీపాప్‌ కంపెనీ(కాంగ్రెస్‌) మర్చిపోయింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 22 పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెట్టుబడి వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచింది. అంతేకాదు పూర్వాంచల్‌ ప్రాంతాన్ని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహేల్‌దేవ్‌ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు.

వారణాసిలో ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ సౌత్‌ ఏసియా రీజినల్‌ సెంటర్‌(ఐఎస్‌ఏఆర్‌సీ) క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ, దీన్ని జాతికి అంకితం చేశారు. దక్షిణాసియాలో వరి పంటపై పరిశోధనలకు, శాస్త్రవేత్తల శిక్షణకు ఐఎస్‌ఏఆర్‌సీ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రధాని మోదీ విమర్శలపై కాంగ్రెస్‌ స్పందించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడాక, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేశాక ఇప్పుడు మోదీకి రైతులు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్‌ ఎద్దేవాచేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top