8 ఏళ్లుగా కోమాలో.. కేంద్ర మాజీ మంత్రి మృతి

Congress Leader Priya Ranjan Dasmunsi Passes Away - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియ రంజన్‌ దాస్‌మున్షీ(72) ఇక లేరు. 8 ఏళ్లుగా ఆయన కోమాలో ఉన్న ఆయన సోమవారం మధ్యాహ్నాం మృతి చెందినట్లు అపోలో వైద్యులు ధృవీకరించారు.  ఈ విషయాన్ని ఆయన భార్య, కాంగ్రెస్‌ నేత దీపా దాస్‌మున్షీ తెలియజేశారు కూడా.

కాగా, 2008లో ఆయనకు గుండెపోటు రాగా, ఆస్పత్రిలో చేర్పించారు. ఆ షాక్‌లో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఇక కుటుంబ సభ్యులు ఆయనను స్టెమ్‌ సెల్‌ థెరపీ కోసం జర్మనీకి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. అక్టోబర్‌ 12న ఆయనకు గుండెపోటు రాగా.. ఎయిమ్స్‌కు తరలించారు. 

శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌లో చేరినట్లు  ఆ సమయంలో వైద్యులు తెలిపారు. పరిస్థితి నానాటికీ క్షీణిస్తూ రావటం.. ఎడమ వైపు భాగం పూర్తిగా చచ్చుబడిపోవటంతో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. తర్వాత ఆయన్ని అపోలోకి తరలించి వైద్యం అందిస్తూ వస్తున్నారు.

కాగా, 1999-2009 మధ్యకాలంలో ఆయన పార్లమెంటేరియన్‌గా(రాయ్‌గంజ్‌ నియోజకవర్గం) నుంచి ఎన్నికయ్యారు. యూపీఏ-1(2004-2008 అస్వస్థతకు గురయ్యేదాకా) లో ఆయన మన్మోహన్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఆల్‌ ఇండియా ఫుట్‌ బాల్‌ ఫెడరేషన్‌కు 20 ఏళ్లు ఆయన ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఓ మ్యాచ్‌కు భారత్‌ తరపున కమీషనర్‌గా వ్యవహరించిన ప్రథమ వ్యక్తి ఈయనే కావటం విశేషం. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top