కోర్టుకెళతా.. న్యాయపోరాటం చేస్తా

Congress Leader Bhupathi Reddy Criticises Legislative council Chairman - Sakshi

అనర్హత వేటుపై మండిపడ్డ భూపతిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో తనపై శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్‌ నేత భూపతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోనే చీకటి రోజు అని, ముగ్గురి మీద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించడం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ్‌ రెడ్డిలను అనర్హలుగా మండలి చైర్మన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నేను ఏ పార్టీ గుర్తు మీద గెలువలేదు. గవర్నర్ కోటాలో ఎన్నిక కాలేదు. నాపై ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసలో విలీనం అయినట్లు గెజిట్ కూడా విడుదల చేశారు. అలాంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది. ఏ ప్రాతిపదికన నాపై అనర్హత వేటు వేశారు? కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఫిరాయింపు కేసు వేశాం. కానీ, దానిపై చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నుకుంటేనే కదా మండలి చైర్మన్ అయ్యారు. పెద్దల సభలోనే న్యాయం జరగనప్పుడు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది. ఈ అంశంపై కోర్టుకు వెళతా.. న్యాయపోరాటం చేస్తా’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top