తరాలుగా గుజరాత్‌ను అవమానిస్తున్నారు

Congress is dishonouring Gujarat : Amit Shah - Sakshi

కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ధ్వజం 

కరమ్‌సాద్ ‌: కాంగ్రెస్‌ పార్టీ మూడు తరాలుగా గుజరాత్‌ను అవమానిస్తూనే ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. స్వతంత్ర భారత్‌ తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ జన్మస్థలం కరమ్‌సాద్‌లో ఆదివారం ఆయన ఇంటిని సందర్శించి నివాళులర్పించిన అనంతరం ‘గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర’ను షా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ‘ఇటీవల గుజరాత్‌కు వచ్చిన రాహుల్‌ గాంధీ బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. గత మూడు తరాలుగా కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌కు చేసిన అన్యాయం గురించి మేం మిమ్మల్ని(కాంగ్రెస్‌) ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్‌ తొలి తరం(నెహ్రూ) సర్దార్‌ పటేల్‌కు భారత రత్నతో పాటు తగిన గుర్తింపు ఇవ్వకుండా తీవ్రంగా అవమానించారు.

రెండో తరంలో ఇందిరాగాంధీ సీనియర్‌ గుజరాతీ నేత మొరార్జీ దేశాయ్‌తో అన్యాయంగా ప్రవర్తించారు. మూడో తరంలో సోనియా–రాహుల్‌ ద్వయం నరేంద్ర మోదీని(గోద్రా అల్లర్ల కేసులో) తీవ్రంగా అవమానించారు. ఈ ఘటనలన్నింటిపై రాహుల్‌ జవాబు కోసం గుజరాత్‌ ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని షా అన్నారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను అవహేళన చేసేవారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని షా హెచ్చరించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అక్టోబర్‌ 1 నుంచి 15 వరకు జరిగే ‘గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర’ రెండు వేర్వేరు మార్గాల్లో సమాంతరంగా సాగనుంది. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో షాతో పాటు ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top