ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌ రెడ్డి విజయం

Congress Candidate Jeevan Reddy Win In Graduates MLC Elections - Sakshi

పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించిన జీవన్‌ రెడ్డి

సాక్షి, కరీంనగర్‌: వరుస విజయాలతో దూసుకుపోతున్న అధికార టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని షాక్‌ తగిలింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీచేసిన సమీప ప్రత్యర్థి  గ్రూప్‌–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవన్‌రెడ్డి గెలుపొందారు. పోటీలో 17 మంది నిలువగా, మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. రెండోస్థానంలో నిలిచిన చంద్రశేఖర్‌ గౌడ్‌కు 17268 ఓట్లు వచ్చాయి.

బీజేపీ బలపరిచిన సుగుణాకర్‌ రావు 15077 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ 5192 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 9932 ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించారు. జీవన్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికలు మొదటి నుంచి రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.

కాగా అంతకు మందు వెలువడిన వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్‌కు ఈ విజయం ఎంతో ఊరట నిచ్చింది. పూల రవీందర్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించగా, నర్సిరెడ్డికి కాంగ్రెస్‌, వామపక్షలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నర్సిరెడ్డి గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top